నర్సాపూర్, జూలై18: కోర్టు భవన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోర్టు ప్రధాన గోడ కూలిపోయింది. దీంతో ఎమ్మెల్యే సోమవారం కోర్టు శిథిలాలను పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోర్టును పరిశీలించి జడ్జి అనితతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారీ వర్షానికి కోర్టు ప్రధాన గోడ కూలిపోయిందని, రాత్రి వేళలో కూలడంతో ప్రమాదం తప్పిందని అన్నారు. కోర్టు భవన నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానన్నారు.
ప్రస్తుతం కోర్టును ఐసీడీఎస్ అధికారుల సమ్మతం మేరకు నర్సాపూర్‌లోని ఐసీడీఎస్ కార్యాలయంలోకి మార్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయాన్ని ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలోకి మార్చినట్లు తెలిపారు. ఐసీడీఎస్ వాళ్లకు ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది ఆందోళన చెందవద్దని సూచించారు. తాత్కాలిక కోర్టును తయారు చేయాలని, ఐసీడీఎస్ కార్యాలయాన్ని అన్ని వసతులతో వారికి అప్పగించాలని పంచాయతీరాజ్ డీఈ రాధికాలక్ష్మిని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, సీనియర్ న్యాయవాది అంజిరెడ్డి, ఏఎమ్‌సీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీధర్‌గుప్తా, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, తహసీల్దార్ భాస్కర్, సీడీపీవో హేమ భార్గవి, ఏఈ స్వామిదాస్, గొర్రె వెంకట్, నగేశ్, బార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.