పటాన్చెరు, జూలై 17;పటాన్చెరు ప్రాంత ప్రజల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పిస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 82 ద్వారా ఆదివారం పాలనా పరమైన అనుమతులు జారీ చేయడంతో త్వరలోనే అత్యాధునిక వసతులతో కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందనున్నాయి. రూ.184.87 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలను కల్పిస్తూ పీసీబీ, రాష్ట్ర సర్కార్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తుండగా, ఇందుకోసం ప్రస్తుత ఏరియా దవాఖాన పక్కన ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ స్థలాన్ని ఎంపిక చేశారు. త్వరలోనే మంత్రులు హరీశ్‌రావు,కేటీఆర్, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిల సహకారంతో పనులకు శంకుస్థాపన చేసి నిర్మాణాలను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. అతిపెద్ద దవాఖాన అందుబాటులోకి రానుండడంతో స్థానికులతో పాటు ఇక్కడ పరిశ్రమల్లో పనిచేస్తున్న వివిధ రాష్ర్టాలకు చెందిన వేలాది మంది కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేదల ఆరోగ్యానికి అభయం కల్పిస్తూ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు పటాన్‌చెరుకు సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేశారు. మినీ ఇండియాగా పిలుచుకునే పారిశ్రామికవాడలోని ప్రజలకు ఈ దవాఖానతో ఆరోగ్యానికి భరోసా కలుగనున్నది. రూ.184.87 కోట్లతో 200ల పడకల దవాఖానను నిర్మించనున్నారు. ఇప్పటికే ఇక్కడ 100 పడకల ఏరియా దవాఖాన ఉండగా, అదనంగా 200ల పడకల సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌డ్డి ఈ దవాఖాన కోసం మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో సాధించారు. ఈ దవాఖాన నిర్మాణానికి 75 శాతం నిధులు రూ.138.65 కోట్లను కాలుష్య నియంత్రణ మండలి, 25శాతం నిధులు రూ.46.21 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. నియోజకవర్గంలోని పలు పారిశ్రామికవాడ(ఐలా)లు ఈ నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నాయి. పీసీబీ నిధులతో పాటు సీఎస్సార్ నిధులు, ఐలాల సహాయాలతో ఈ దవాఖాన అందుబాటులోకి రానున్నది.
పటాన్చెరు నియోజకవర్గంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఉపాధి పొందుతున్నారు. వందలాది పరిశ్రమలు ఉండటంతో వలసవాసుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. వారికి కూడు, గుడ్డ, గూడుకు సమస్య లేకున్నా, వైద్య సేవల విషయంలో సామాన్యులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం గ్రహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 2018 ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కి 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన కోసం విన్నవించారు.
దీంతో సీఎం కేసీఆర్ ఈ దవాఖాన నిర్మాణానికి హామీనిచ్చారు. ఆ తరువాత మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లతో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సాయంతో ఎమ్మెల్యే కార్యాచరణకు కదిలారు. ఈ నేపథ్యంలో పీసీబీశాఖ వద్ద ఫెనాల్టీల ద్వారా వచ్చిన సొమ్మును ప్రజాప్రయోజన కార్యక్రమాలకు వినియోగించుకుందామనే ప్రతిపాదనకు కార్యరూపం కల్పించారు. పటాన్చెరు పారిశ్రామికవాడలోనే సూపర్ స్పెషాలిటీ దవాఖాన పెట్టేందుకు నిర్ణయించారు. దీనితో పటాన్చెరులో 200 పడకల దవాఖానకు అనుమతులు వచ్చాయి.
ముఖ్యమంత్రి ఆదేశాలతో స్థలం సిద్ధం
సీఎం కేసీఆర్ పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన కోసం పాలనాపరమైన అనుమతులు ఇవ్వనున్నారని తెలియడంతో దవాఖాన ఏర్పాటు కోసం స్థలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఏరియా దవాఖానకు ఆనుకుని ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ స్థలాన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖాన కోసం ఎంపిక చేశారు. శిథిలావస్థకు చేరిన రూరల్ హెల్త్ సెంటర్‌ను కూల్చివేసి స్థలాన్ని చదును చేశారు. ఈ స్థలంలో త్వరలోనే శంకుస్థాపనలు చేస్తారు. నిర్మాణం పనులు శరవేగంగా చేసేందుకు ఎమ్మెల్యే అధికారులతో కలిసి కార్యాచరణ చేపడుతున్నారు.
భవనాల నిర్మాణాలతో పాటు సిబ్బంది ఉండేందుకు క్వార్టర్లు కూడా కట్టబోతున్నారు. దవాఖానలో సూపర్ స్పెషాలిటీకి వైద్య నిపుణులు, సిబ్బందిని సైతం నియమించనున్నారు. అన్ని రకాల వైద్య బృందాలు ఇక్కడ సేవలందించేలా నియామకాలు చేస్తారు. అత్యాధునికమైన ల్యాబ్, రోగ నిర్ధారణ యంత్రాలు, రోబోటిక్ వైద్య పరికరాలను, అంబులెన్స్‌లు, ఆపరేషన్ థియేటర్స్ సైతం అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ దవాఖాన నిరుపేదల ఆరోగ్యాలకు భరోసా ఇస్తున్నది.
అందరి ఆరోగ్యాలకు భరోసా
రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 82 రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు అనుమతులు ఇస్తూ జీవో జారీ చేయడంతో పటాన్చెరులో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. జీవో నెంబర్ 82 ద్వారా పాలనాపరమైన అనుమతులు సూపర్ స్పెషాలిటీ దవాఖానకు వచ్చాయి. రూ.184 కోట్ల 87 లక్షల 55వేల నిధులు ఈ దవాఖాన కోసం మంజూరు చేశారు. మొత్తం వ్యయంలో 25శాతం రూ.46కోట్ల 21లక్షల 88వేలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 75 శాతం నిధులు రూ.138 కోట్ల 65లక్షల 66వేల, 287లను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి భరిస్తుంది.
దశాబ్దాలుగా పీసీబీ వద్ద ఉండిపోయిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు చేయనున్నది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ప్రజారోగ్యం కోసం పీసీబీ నిధులు ఖర్చు చేయాలని సూచనలు చేయడంతో పటాన్చెరులో ఈ దవాఖాన నిర్మాణం కాబోతున్నది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధను తీసుకుని మంత్రుల సాయంతో పెద్ద ముందడుగు వేశారని ప్రజలు కొనియాడుతున్నారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
– పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్చెరులో సూపర్ స్పెషాలిటీ దవాఖాన కావాలని కోరిన వెంటనే సీఎం కేసీఆర్ తప్పక ఇస్తామని హామీనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అనుమతులు ఇచ్చారు. రూ.184 కోట్లను కేటాయించారు. పీసీబీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిధులను అందజేస్తున్నాయి. సీఎం కేసీఆర్‌కు పటాన్చెరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం. మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. అధికారుల సహకారం ఎంతో ఉపయోగపడింది. త్వరలోనే శంకుస్థాపన చేసి, దవాఖాన నిర్మాణం జరిగేలా చూస్తాం. పటాన్చెరు ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి తీసుకువస్తాం.