మెదక్ మున్సిపాలిటీ, జూలై 17: తెలంగాణ ప్రజల ఆనవాయితీ బోనాలని, గ్రామ దేవతలు కుటుంబాలను చల్లగా చూడాలని ఈ పండుగ జరుపుకొంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మకు వైభవంగా బోనాలు సమర్పించారు. బోనమెత్తుకుని మహిళలతో కలిసి కొద్ది దూరం నడిచారు. అనంతరం ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షుడు బండ నరేందర్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సున్నం నరేశ్‌ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులను సన్మానించారు.
కేరింతలు.. పూనకాలతో వైభవంగా..
యువకుల కేరింతలు, మహిళల పూనకాలతో నల్లపోచమ్మకు ఆదివారం ఉదయమే ముదిరాజులు బోనాలను వైభవంగా సమర్పించారు. మధ్యాహ్నం పట్టణంలోని ఆయా వీధుల్లో మహిళలు బోనాలు ఎత్తుకుని రాందాస్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాత బస్టాండ్, గోల్కొండ వీధుల మీదుగా శోభాయాత్ర కొనసాగి, ఆటోనగర్‌లోని నల్లపోచమ్మ దేవాలయానికి చేరుకుని మాతకు బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ దేవతలైన గట్టమ్మ, బోరంచమ్మ, ముత్యాలమ్మలకు ఆయా వీధుల వారు బోనాలు సమర్పించుకున్నారు.
బోనాలను పురస్కరించుకుని భాజభజంత్రీలతో చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా నృత్యాలు చేస్తూ బోనాలు ఊరేగించారు. ఈ ఉత్సవంలో నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశం, జిల్లా అధ్యక్షుడు పుట్టి రాజు, నాయకులు రాంకిష్టయ్య, గోపాలకృష్ణ, సార శ్రీనివాస్, శేఖర్, సంతోష్, సందీప్, అక్షయ్, నాగరాజు, ఇప్ప భరత్, దుర్గాపతి, ఇప్ప కిషన్, ఆది రవిహరి, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, శివరామకృష్ణ, సుధాకర్ పాల్గొన్నారు. పట్టణ సీఐ మధు ఆధ్యర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.