హుస్నాబాద్, జూలై 16 : ఉన్నత లక్ష్యం.. ఏకాగ్రత, ప్రణాళికతో చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో సులువు అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. శనివారం హుస్నాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో మూడు నెలలుగా గ్రామీణ యు వతకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరం మొదటి బ్యాచ్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగావకాశం కల్పించాలనే లక్ష్యంతో ఖర్చుకు కూడా వెనుకాడకుండా నాణ్యమైన శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. మొదటి బ్యాచ్‌లో 250 మంది అభ్యర్థులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. నిరుద్యోగుల కోసం హుస్నాబాద్‌లో ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేయడం చేశామన్నారు. ఇందులో తెలు గు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతు వేదికలను స్టడీ రూంలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వెనుకబడిన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించి అభివృద్ధికి దోహదపడాలని కోరా రు. శిక్షణా శిబిరం సజావుగా నడిచేందుకు కృషి చేసిన వారందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీ మాలోతు లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, తహసీల్దార్ మహేశ్ కుమార్, నాయకులు వెంకట్రాంరెడ్డి, సాంబరాజు, గోపాల్‌రెడ్డి, బొజ్జ హరీశ్, సాయన్న, స్టడీ సెంటర్ డైరెక్టర్ శ్రీకాంత్, శిక్షణ పొందిన అభ్యర్థులు పాల్గొన్నారు.