
గుమ్మడిదల, జనవరి 1 :గతంల సాగు చేయ్యాలంటే, అప్పులిచ్చేవారే గుర్తుకు వచ్చేది.. అప్పుపుట్టినంక ఎవుసం చెయ్యడానికి పూనుకునే కాలం పోయింది.. కొత్తగా రాష్ట్రం ఏర్పడినంక సీఎం కేసీఆర్ సారూ రైతులను ఆదుకోవడానికి రాత్రింబవళ్లు కరంట్ ఇచ్చిండు. రైతుకు సాయంగా నిలిచిండు. రైతులు అప్పులు తెచ్చుకోకుండా రైతుబంధు తెచ్చిండు. రైతు ఏ కారణంతోనైనా సచ్చిపోతే, రూ.5లచ్చలు ఇస్తుండు. ఈ సాయంతో అప్పులోళ్లు పోయిన్రు. సర్కారు నుంచి అందిన పెట్టుబడి సాయంతో సాగు చేసుకుంటున్నాం. ఏ పంట వేసుకోవాలి? ఏ ఎరువులు వేసుకోవాలో తెలుసుకొని పంటలు పండిస్తున్నం. రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ ముందుకు వచ్చిండు కనుకే, మంచి దిగుబడితో లాభాలు పండిత్తున్నం’.. అని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల రైతు సంఘం అధ్యక్షుడు, రైతు పోచుగారి మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టమాట సాగు చేస్తున్న ఈయన, పలు విషయాలు ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నాడు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
గతంలో ఎవుసం ఎలా ఉండేది?
గతంలో వానకాలం, యాసంగి పంటలు సాగు చేయడానికి ముందుకు గుర్తుకువచ్చేది అప్పులిచ్చే సావుకారి. అప్పు దొరికిన తర్వాతే పంటలను సాగు చేసుకునేవారం.
ఇప్పుడు పెట్టుబడి సాయం తర్వాత ఎలా ఉంది?
సీఎం కేసీఆర్ సారూ పెట్టుబడి సాయం చేయడంతో సాయమందిన వెంటనే పంటలను సాగు చేసుకుంటున్నాం. అప్పులోల్ల బాధ తీరింది. అప్పు కట్టాలనే ఆలోచన లేదు. పెట్టుబడి సాయంతో పంటలు పండిస్తున్నం.
పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో అమ్మేవాళ్లం.. నేరుగా మా ఖాతాల్లో పైసలు పడేవి. రోజుల తరబడి ఎదురు చూడాల్సిన రంది తీరింది. వ్యాపారికి అమ్మితే, వారాల కొద్దీ పైసల కోసం తిరిగెటోళ్లం. ఇప్పుడా చింత పోయింది.
ఉమ్మడి, తెలంగాణ రాష్ర్టానికి గల తేడా ఎలా ఉంది?
అప్పటి ఆంధ్ర సర్కారోళ్లు రైతులను ఆదుకోలె. రైతు ఏమైతే ఏమి! అన్నట్లు ఉండె. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినంక సీఎం కేసీఆర్ సారూ రైతులకు నిరంతరం కరంట్ ఉచితంగా ఇస్తున్నాడు. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై దొరుకుతున్నాయి. విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయి. యూరియా, డీఏపీ కోసం రోజుల తరబడి లైన్ల ఉండే పరిస్థితి ఉండే. ఒకప్పుడు చెప్పులు లైన్ల పెట్టి, చెట్ల నీడన, ఇండ్ల పంచానా ఎదురు చూసేటోళ్లం. ఇప్పుడా బాధ తీరింది. సరిపోయినంత యూరియా, డీఏపీ దొరుకుతున్నది. ఎరువుల కోసం నిరీక్షణ పోయింది.
ఏ పంటలను సాగు చేస్తున్నారు?
రాష్ట్ర సర్కారు ఏ సీజన్లో ఏ పంటలను సాగు చేసుకోవాలో చెబుతున్నది. యాసంగిలో ఇతర పంటలను సాగు చేసుకుంటున్నాం. టమాట, క్యాబేజీ, మిర్చి, శనగ వంటి ఇతర పంటలు పండిస్తున్నం. రైతు బీమాతో రైతు కుటుంబాన్ని ఆదుకుంటూ రైతాంగాన్ని ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ సర్కారు అండగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత మంచిగా చూసుకుంటలేదు. మన రాష్ట్ర సర్కారు తప్పా. రైతులకు పెద్దన్నగా సీఎం సారూ ఉండడం సంతోషంగా ఉంది. కేసీఆర్ సర్కారులో రైతుల చింతలు తీరి సుఖంగా బతుకుతున్నాం.
సంతోషంగా ఉంది..
ప్రస్తుతం కూరగాయలు పెట్టాలనుకుంటున్న. తినడానికి 10 గుంటల వరి పెట్టుకుని, మిగతా రెండున్నర ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తా. గతంలో పంటలు వేసే సమయంలో పెట్టుబడి పెట్టాలంటే దుఃఖం వచ్చేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతుబంధు అందిస్తుండడంతో బాధలు తప్పాయి.