పటాన్చెరు, జూలై 11: రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగా నూతన పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని అల్‌ప్లా కంపెనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అల్‌ప్లా వరల్డ్ క్లాస్ మౌల్డ్ షాపు, డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆస్ట్రియా రాయబారి క్యాథరినా వీజర్, అల్‌ప్లా గ్రూప్ సీఈవో ఫిలప్ లెహ్నర్, అల్‌ప్లా కంపెనీ ఎండీ వాగీశ్ దీక్షిత్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర సాంకేతికశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, పారిశ్రామికవేత్త వివేక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పాశమైలారంలో అల్‌ప్లా కంపెనీ రూ.50 కోట్లతో కొత్తగా మౌల్డ్ షాపు, రూ.10 కోట్లతో డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం కల్పిస్తున్నదని తెలిపారు. టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు స్వల్పకాలంలో అనుమతులు ఇస్తున్నామని, పరిశ్రమల ఏర్పాటును సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే రాష్ర్టానికి పెద్దఎత్తున కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. గతంలో పారిశ్రామిక వేత్తలు కరెంటు కోసం ధర్నాలు చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయని, తద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంగారెడ్డి కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్ రాజర్షిషా, టీఆర్ఎస్ కార్పొరేటర్లు మెట్టుకుమార్‌యాదవ్, పుష్పానగేశ్, టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, ఆదర్శ్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి, పాశమైలారం ఉపసర్పంచ్ కృష్ణ, మాజీ సర్పంచ్‌లు గోపాల్‌రెడ్డి, ఎల్.సుధాకర్‌గౌడ్, చందు ముదిరాజ్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఐదు విప్లవాలు..
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో సస్య, క్షీర, నీలి, గులాబీ, పసుపు విప్లవాలు ప్రారంభమైనట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో సాగునీరు అందుబాటులోకి వచ్చి లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినట్లు తెలిపారు. పాడిపరిశ్రమ పెరిగి క్షీరవిప్లవం ప్రారంభమైందని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నట్లు చెప్పారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణంతో రాష్ట్రంలో చేపల పెంపకం పెరిగి నీలి విప్లవం కొనసాగుతున్నదని, ప్రభుత్వం రాష్ట్రంలో పశు సంపద పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. తద్వారా మాసం ఉత్పత్తి, ఎగుమతులు పెరిగి తద్వారా నీలి విప్లవం కొనసాగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తూ, రాష్ట్రంలో పసుపు విప్లవానికి బాటలు వేసినట్లు వివరించారు.
సంగారెడ్డి జిల్లాకు మరిన్ని పరిశ్రమలు..
సంగారెడ్డి జిల్లాకు పెద్దఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. సుల్తాన్ఫూర్లో మెడికల్ డివైజ్ పార్కులో ఇప్పటికే 50 పరిశ్రమలు ఏర్పాటు చేశాయన్నారు. ఇటీవలే తాను ఏడు పరిశ్రమలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఫ్లో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన నాలుగు పరిశ్రమలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మెడికల్ డివైజ్ పార్కులో ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టంట్ తయారీ కంపెనీ సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్‌ను తాను ఇటీవల ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. జిన్నారం మండలం శివానగర్‌లో 300ఎకరాల్లో ఎల్ఈడీ పార్కుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. ఎల్ఈడీ పార్కు ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అల్‌ప్లా యాజమాన్యం తెలంగాణలో పరిశ్రమలను విస్తరించడంతో పాటు మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు. అల్‌ప్లా పరిశ్రమల్లో స్థానికులకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఆస్ట్రియా నుంచి తెలంగాణకు పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని ఆస్ట్రియా రాయబారి క్యాథరినా వీజర్ను మంత్రి కోరారు. అల్‌ప్లా డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ మిగిలిన పరిశ్రమలకు రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటుతో యువతలో నైపుణ్యాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
టీఆర్ఎస్ పాలనలో పారిశ్రామిక అభివృద్ధి: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి ఫలితంగా రాష్ట్రం పారిశ్రామికరంగంలో అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణలో 24గంటల కరెంటు సరఫరా అవుతుండడంతో పరిశ్రమలు మూడు షిప్టులు పనిచేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుతో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. పటాన్చెరు ప్రాంతం మినీ ఇండియా అని, ఇక్కడ దేశంలోని అనేక ప్రాంత ప్రజలు, కార్మికులు బతుకుతున్నారన్నారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని, మంత్రి కేటీఆర్ చొరవ ఫలితంగా పటాన్చెరు నియోజకవర్గంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని, తద్వారా యువతకు ఉపాధి లభిస్తున్నట్లు తెలిపారు. తెల్లాపూర్, కొల్లూర్‌లో ఐటీ పార్కులు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అల్‌ప్లా కంపెనీలు స్థానికులకు ఉపాధి ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.