
గజ్వేల్, నవంబర్ 21: పార్టీ అభివృద్ధికి కృషి చేసిన అందరికీ సీఎం కేసీఆర్ సముచిత స్థానాన్ని ఇస్తారని మరోసారి రుజువు చేశారు. త్వరలో జరుగనున్న మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గజ్వేల్‌కు చెందిన డాక్టర్ వంటేరి యాదవరెడ్డిని ఎంపిక చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో యాదవరెడ్డి చేరారు. పార్టీ అభివృద్ధి, ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ యాదవరెడ్డికి ఇచ్చిన మాట మేరకు మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. పార్టీ అభివృద్ధికి నమ్మకంగా పనిచేసే వారికి ఎప్పటికైనా తగిన గుర్తింపు ఇస్తుందని డాక్టర్ యాదవరెడ్డి ఎంపికతో అందరికీ అర్థమయ్యింది.
యాదవరెడ్డి వ్యక్తిగతం..
డాక్టర్ యాదవరెడ్డి 1981లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1983 నుంచి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. మరిన్ని సేవలందించడానికి జ్యోతి మెటర్నిటీ నర్సింగ్‌హోం ప్రారంభించి వైద్యసేవలను కొనసాగించారు. ఈక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గజ్వేల్శాఖ అధ్యక్షుడిగా సేవలందించారు. గజ్వేల్‌లో లయన్స్‌క్లబ్ ఆఫ్ గజ్వేల్‌ను ప్రారంభించి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. లయన్స్‌క్లబ్, జ్యోతి మెటర్నిటీ నర్సింగ్‌హోం ఆధ్వర్యంలో గజ్వేల్ ని యోజకవర్గ వ్యాప్తంగా స్వతహాగా, సరోజిని కంటి దవాఖాన సహకారంతో ఉచిత కంటి వైద్యశిబిరాలను నిర్వహించారు. డాక్టర్ యాదవరెడ్డి అందించిన ప్రజాసేవలకు గానూ వివిధ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు వచ్చాయి.
వైద్యుల కుటుంబం.. గజ్వేల్‌కు అంకితం..
డాక్టర్ యాదవరెడ్డిగానే గజ్వేల్‌తో పాటు పరిసర ప్రాంతాలకు తెలిసిన డాక్టర్ వంటేరి యాదవరెడ్డి స్వగ్రామం క్యాసారం. ప్రస్తుతం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనమయ్యింది. యాదవరెడ్డి కుటుంబంలో భార్య రమాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కాగా, మిగతా వారంతా వైద్యులే. యాదవరెడ్డి కుమారుడు డాక్టర్ జయంత్‌రెడ్డి యూరాలజీ నిపుణుడు కాగా, కోడలు డాక్టర్ శ్వేత గైనకాలజీ నిపుణురాలు. కూతురు డాక్టర్ జ్యోతి కంటి వైద్య నిపుణురాలిగా గజ్వేల్ దవాఖానలో వైద్యసేవలందిస్తున్నారు. అల్లుడు డాక్టర్ శంతన్‌రెడ్డి కూడా చిన్న పిల్లల వైద్య నిపుణులు కాగా, గజ్వేల్ దవాఖానలోనే వైద్యసేవలను అందిస్తున్నారు.
రాజకీయ జీవితం..
డాక్టర్ వంటేరి యాదవరెడ్డి తన రాజకీయ జీవితాన్ని తన స్వగ్రామమైన క్యాసారం నుంచే ప్రారంభించారు. 1978 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మొదటగా క్యాసారం సర్పంచ్‌గా ఎన్నిక కాగా, నియోజకవర్గ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగారు. 2006 నుంచి 2010 వరకు గజ్వేల్ ప్రాంత రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చక్కని సేవలందించారు. ఏఎంసీ చైర్మన్‌గా డాక్టర్ యాదవరెడ్డి బాధ్యతలు నిర్వహించిన సమయంలో రైతులకు చక్కని సేవలందించిన ఉత్తమ మార్కెట్ గజ్వేల్ మార్కెట్ కమిటీ గుర్తింపు పొందింది. యాదవరెడ్డి చైర్మన్‌గా కొనసాగిన రోజుల్లోనే గజ్వేల్ ప్రాంత రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల రైతులకు దీనివల్ల ఎంతో మేలు జరిగింది. ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయల రైతుల అభివృద్ధి కోసం సబ్‌మార్కెట్ యార్డును కూడా ఏర్పాటు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి కాంక్షించి 2014 అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు టీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తరుఫున ఎన్నికల ఏజెంటుగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ రెండోసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో యాదవరెడ్డి సేవలకు సరైన సమయంలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మెదక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.