మెదక్ మున్సిపాలిటీ, జూన్ 27: విద్యుత్తు అధికారులు తమ పని తీరును మార్చుకోవాలని ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం మెదక్ జిల్లా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు.
శివ్వంపేట, నార్సింగి, టేక్మాల్ ఎంపీపీలు మాట్లాడుతూ తమ మండలాల్లో విద్యుత్తు సమస్యలు గురించి గత సమావేశాల్లో అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారులు రైతు బీమా పత్రాలు సరిచూడాలని నిజాంపేట జడ్పీటీసీ విజయ్‌కుమార్ సూచించారు. రైతులు విత్తనాలు వెదజల్లే విధానంపై ఇప్పటి వరకు కొల్చారం మండలంలో రైతులకు అవగాహన కల్పించలేదని జడ్పీటీసీ మేఘమాల అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లా వెనుకబడి ఉందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు వేగంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డీఈవో రమేశ్‌కుమార్‌కు సూచించారు. మండలాల్లో ఉన్నతాధికారులు పర్యటిస్తున్న సమాచారం ఉండటంలేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం లేదని పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జడ్పీ చైర్మన్ జోక్యం చేసుకుని ప్రతి అభివృద్ధి కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
కరోనా ఫోర్త్ వేవ్ ముప్పు
కరోనా ఫోర్త్‌వేవ్ ముప్పు పొంచియున్నదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని డీఎమ్హెచ్వో వెంకటేశ్వర్లు సూచించారు. ఎంపీపీల ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకోసారి పీహెచ్సీ పరిధిలో సమావేశం నిర్వహించి, వారి పనితీరును సమీక్షించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందేలా తగు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్పర్సన్, డీఎమ్‌హెచ్‌వోను సూచించారు. దవాఖానల్లో కావాల్సిన ఆధునిక పరికరాలు ఉన్నందున రోగులు బయటికి పంపొద్దన్నారు. జిల్లాలలోని పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించుకున్నామని, త్వరలో రాబోయే హరితహారాన్ని ఇదే స్ఫూర్తితో విజయవంతం చేసుకుందామని జడ్పీ చైర్పర్సన్ గౌరవ సభ్యులకు సూచించారు. సమావేశంలో ఆదనపు కలెక్టర్ రమేశ్, జడ్పీ సీఈవో వెంకటశైలేశ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీటీసీలు ఎంపీపీలు, తదితర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
చిత్తశుద్ధి ప్రదర్శించాలి
విద్యుత్తు అధికారులు సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. ఎస్ఈ జానకీరాం పనితీరు బాగా లేదు. తన విధానాన్ని మార్చుకోవాలి. రామాయంపేటలో ఫీడర్ చానల్ ఫెయిల్ అయితే నాలుగు రోజుల పాటు పలు కాలనీల్లోని ప్రజలు చీకట్లో మగ్గారు. ఇది విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. కరెంట్ సమస్య పరిష్కరించకుండా అధికారులు ఏమి చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలకే రోజుల పాటు టైం తీసుకుంటే, పెద్ద సమస్యలు వస్తే ఎలా పరిష్కరిస్తారు. ఇలాంటి సమస్యలు పునరావృతం కావొద్దు. ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్ధి ప్రదర్శించాలి. – పద్మా దేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్
సమస్యలు అధికంగా ఉన్నాయి
నర్సాపూర్‌లో విద్యుత్తు సమస్యలు అధికంగా ఉన్నాయి. వెంటనే పరిష్కరించాలి.టేక్మాల్‌లో ఇండ్ల పైనుంచి 33 కేవీ కరెంట్ తీగలు వెళ్లాయని, వాటిని వేరే మార్గంలో తరలించాలి. కొన్ని నెలలుగా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోవడంలేదు. సిబ్బందితో గట్టిగా మాట్లాడితే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. చాలాకాలంగా ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ల స్థాన చలనం చేపట్టాలి.
– చిలుముల మదన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నర్సాపూర్
రైతులకు అవగాహన కల్పించాలి
నల్లరేగడి నేలల్లో పత్తి సాగు యోగ్యం కాదన్న విషయంలో రైతులకు అవగాహన కలిగించాలి. రైతు బీమా కలిగిన రైతులు చనిపోతే ఆ కుటుంబానికి బీమా డబ్బులు అందడం లేదు, మెదక్ జిల్లాలో 121 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి పొరపాట్లు ముందే గుర్తించాల్సిన అవసరం వ్యవసాయాధికారులపై ఉంది. వారి తప్పిదాలతోనే రైతులు బీమా సొమ్ము పొందలేకపోతున్నారు. ఇకముందు జాగ్రత్తగా అన్ని వివరాలు సేకరించాలి.
– సుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ