మెదక్ అర్బన్, జూన్27: అర్జీదారుల సమస్యలు చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన కుసంగి నర్సింలు అదే గ్రామానికి చెందిన సర్వే నం45లో 4 గుంటల భూమిని రూ.1.20 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందులో మొదటి విడతగా రూ.40వేలు, రెండో విడతలో రూ.50వేలు ఇచ్చాడు. మిగతా డబ్బులు ఇవ్వడానికి అమ్మిన వ్యక్తి దగ్గరకు వెళ్లగా నేడు, రేపు అంటూ కాలం వెల్లదీస్తున్నాడు. దీంతో అతనిపై అనుమానం వచ్చి, వివరాలు తెలుసుకొగా తనకు అమ్ముతానని చెప్పిన భూమిని ఇదివరకే మరో వ్యక్తికి అమ్మాడని, అందుకే తనకు రిజిస్ట్రర్ చేయడం లేదని ఫిర్యాదు చేశాడు. ఎస్పీ స్పందిస్తూ ఫిర్యాదుదారుడికి తగిన న్యాయం చేయాలని నర్సాపూర్ ఎస్సైకి సూచించారు. పెద్ద శంకరంపేట మండలం కొత్తకోట గ్రామానికి చెందిన ఏసయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నానా బూతులు తిడుతూ దాడి చేశారని ఫిర్యాదు చేశాడు. చట్ట ప్రకారం ఫిర్యాదీకి తగిన న్యాయం చేయమని పెద్దశంకరంపేట ఎస్సైకి ఎస్పీ సూచించారు.
రోడ్డు మరమ్మతుల పరిశీలన
మాధవరం శివారులో రోడ్డు మరమ్మతులను జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ సోమవారం పరిశీలించారు. జిన్నారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో వచ్చిన చర్చకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్పందించారు. వెంటనే కంకర క్రషర్ల యజమానులతో చర్చించారు. వారు స్పందించి రోడ్డును మరమ్మతు లు చేయిస్తామని అంగీకరించి, పనులు ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం రోడ్డు మరమ్మతులు చేయిస్తున్నామని జడ్పీ వైస్ చైర్మన్ తెలిపారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ నాయకులు గణేశ్, సురేశ్ రోడ్డు పనులను పరిశీలించారు.