
న్యాల్కల్, నవంబర్ 22 : మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక ఆలయం సంకష్టహర చతుర్థి వేడుకలకు ముస్తాబైంది. సంవత్సరం పొడవునా ప్రతి నెలా వచ్చే సంకష్టహర చతుర్థి రోజుల్లో దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో… మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థి రోజున దర్శించుకుంటే అంత పుణ్యఫలం వస్తుందనేది భక్తుల నమ్మకం. సిద్ధివినాయకుడిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కర్ణాటక, మహారా ష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఆయా ప్రాంతాల నుంచి పాదయాత్రతో పాటు ప్రత్యేక వాహనాల్లో ప్రజలు భారీగా వస్తారు. కొవిడ్ నిబంధనల మేరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను పార్కింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుం డా తాగునీరు, వసతి, అన్నదానం తదితర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. సంకష్టహర చతుర్థి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జహీరాబాద్ డీఎస్సీ శంకర్‌రాజ్ పర్యవేక్షణలో జ హీరాబాద్ రూరల్ సీఐ భరత్‌కుమార్, హద్నూర్ ఎస్సై వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే వేదపండితులు స్వామివారికి ఆభిషేకం, గణపతి హవనం, హారతి తదితర పూజలు చేస్తారని ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రేజింతల్ సంగయ్య, అల్లాడి నర్సింహులు తెలిపారు. భక్తులు మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పా టిస్తూ అధిక సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.