జహీరాబాద్, జూన్ 21: రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు జహీరాబాద్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోపలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్లో అభివృద్ధి పనులకు రూ. 50 కోట్లు మంజూరు చేసింది. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. కాగా, జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. మంత్రి కేటీఆర్ రాక కోసం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు భారీగా ఏర్పాట్లు చేశారు.
ప్రధాన రోడ్డు వెంట టీఆర్ఎస్ జెండాలు ఏర్పాటు చేశారు. 10 వేల మందిని సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసింది. పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయలు కలిపించేందుకు సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, ప్రతి ఇంటికీ మిషన్ భగరీథ నీటి సరఫరా చేసేందుకు ట్యాంకులు నిర్మాణం చేసి, పైపులైన్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు సమీకృత కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నారు.

మంత్రి కేటీఆర్ పర్యాటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే మాణిక్‌రావుతో పాటు ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, జహీరాబాద్ పట్టణ, మండలాధ్యక్షుడు సయ్యద్ మోహినొద్దీన్, ఎంజీ రాములు, విజయ్‌మోహన్‌రెడ్డి పలువురు నాయకులు కృషి చేస్తున్నారు. పర్యటనకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశల మేరకు అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో రమేశ్‌బాబు, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు ఐకేపీ అధికారులతో సమావేశాలు నిర్వహించి, భారీ జన సమీకరణకు అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ కుమార్ ఆధ్వర్యంలో కేటీఆర్ పర్యటనలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. జహీరాబాద్ డీఎస్పీ రఘు, సీఐ తోట భూపతి, ఎస్సై శ్రీకాంత్ భారీ బందోబస్తు ఏర్పాట్లను పర్యావేక్ష నించనున్నారు.