యోగా.. యాంత్రిక జీవనంలో పని ఒత్తిళ్ల మధ్య నలిగిపోతూ ప్రశాంతత కరువైన వారికి ఆహ్లాదాన్నిచ్చే ప్రక్రియ. మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యానికి అచంచలమైన ధీమా ఇచ్చే యోగాను సగటు జీవి నుంచి ధనవంతుల వరకు నేర్చుకుంటూ ఆచరణలో పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆయా జిల్లాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పలు యోగాసనాలు వేశారు. యోగా అకాడమీ, వివిధ సంస్థలు, కార్యాలయాల ఆవరణల్లో యోగా డేను పెద్ద ఎత్తున నిర్వహించారు.