సంగారెడ్డి, జూన్ 19: రెండేండ్ల క్రితం టీఎస్ఆర్టీసీ ప్రారంభించిన ‘కార్గో’ విస్తృతంగా సేవలందిస్తున్నాయి. గుండుసూది నుంచి పెద్దపెద్ద సరుకులను సైతం సకాలంలో గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది. దశాబ్దాల పాటు నష్టాల్లో కూరుకపోయిన సంస్థకు కార్గో సంజీవనిలా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 బస్ డిపోల్లో 4 ప్రత్యేక బస్సులను అధికారులు అందుబాటులో ఉంచారు. మొత్తం 18 పాయింట్లు ఏర్పాటు చేసి పార్సిళ్లు చేరవేస్తున్నారు. ఇప్పటి వరకు 4.05లక్షల పార్సిళ్లను వివిధ ప్రాంతాలకు రవాణా చేయగా, రూ. 3.55 కోట్ల ఆదాయం సమకూరింది. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వచ్చి తీసుకోవడం.. డెలివరీ కూడా ఇంటి వద్దకే చేస్తుండడంతో వినియోగదారులు ప్రైవేటు సంస్థల కంటే ఆర్టీసీ కార్గోపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు, కార్మికులు కలిసికట్టుగా పనిచేస్తుండడంతో ఆదాయం పెరగడంతో పాటు మెరుగైన సేవలు అందుతున్నాయి. కార్గో రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం సంగారెడ్డి డిపోలో రీజినల్ మేనేజర్ సుదర్శన్ కేక్ కట్ చేసి ఉద్యోగులతో కలిసి సంబురాలు జరుపుకొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 4.10 లక్షల పార్సిళ్లను చేరవేయడంతో ఆర్టీసీకి రూ.3.55 కోట్ల ఆదా యం వచ్చిందని ఆర్టీసీ అధికారులు సంతోషంతో రెం డేండ్ల సంబురాలు చేసుకున్నారు. ఆదివారం సంగారెడ్డి డిపో ఆవరణలో ఉన్న కార్గో పార్సిల్ కేంద్రంలో రీజినల్ మేనేజర్ సుదర్శన్ కేక్‌కట్ చేసి ఉద్యోగులతో వేడుకలు జరుపుకొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొలి రోజుల్లో ఆర్టీసీ కోసం నిధులు విడుదల చేసినా నష్టాలు తగ్గలేదు. టీఆర్ఎస్ సర్కార్ నూతన చర్యలు చేపట్టడంలో భాగంగా కార్గో సేవలు ప్రారంభించడంతో ఆర్టీసీ ఆదాయం దిశగా పరుగులు పెడుతున్నది. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వారు రెట్టింపు ఉత్సాహంతో అధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నారు.

ఇంటింటికీ సేవలు..
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త ఆలోచనలతో ఇంటింటికీ పార్సిల్ సేవలు అందించడం మరోవిశేషం. చిన్నగుండు సూది నుంచి బస్సుల్లో వస్తువులన్నింటినీ వినియోగదారుల చిరునామాలకు చేరవేస్తున్నది. ముఖ్యంగా పాలు, పండ్లు, కూరగాయలు ఇతర సరుకులను చేరవేస్తూ కార్గో సేవలపై వినియోగదారులకు నమ్మకం పెంచింది. ఆర్టీసీ కార్గో సేవలతో ప్రైవేటుకు ధీటుగా అడ్రస్సుల వారీగా పార్సిళ్లను చేరవేస్తూ తనదైన ముద్ర వేసుకున్నది.
18 పాయింట్లు, 4 బస్సులతో పార్సిల్ సేవలు..
మెదక్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో 4 ప్రత్యేక కార్గో బస్సులతో 18 పాయింట్లను ఏర్పాటు చేసి పార్సిల్ సేవలు అందిస్తున్నారు. ప్రజా రవాణాకు తిరుగుతున్న బస్సులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్గో బస్సులతో వినియోగదారులు ఇచ్చిన అడ్రస్సులకు పార్సిళ్లను చేరవేస్తున్నారు. సంగారెడ్డి డిపో పరిధిలో ఒకటి, సదాశివపేట, జోగిపేట బస్టాండ్‌లో పాయింట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. జహీరాబాద్‌లో ఒకటి, నారాయణఖేడ్ డిపోతో పాటు పెద్దశంకరంపేట, మెదక్ డిపోతో పాటు నర్సాపూర్, రామాయంపేట్, చేగుంటలో ఏర్పాటు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలోని పాత, కొత్త బస్టాండ్లు, చేర్యాల్లో, దుబ్బాక డిపోలో, గజ్వేల్ డిపోతో పాటు ప్రజ్ఞాపూర్, తూప్రాన్, హుస్నాబాద్ డిపో పరిధిలో పాయింట్లను ఏర్పాటు చేసి పార్సిళ్లను ప్రయాణికులు, వినియోగదారులకు సకాలంలో అందిస్తూ కార్గో సేవల్లో వేగం పెంచారు. కరోనా విపత్కర కాలంలో ప్రారంభించి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయంపై దృష్టి పెట్టి ఆర్టీసీ రాబడికి దారులు వేయడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీకి రూ.3.55 కోట్ల ఆదాయం..
కార్గో సేవలను ఆర్టీసీ కరోనా కష్ట కాలంలో జూన్ 19న 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. అప్పటి నుంచి రవాణా సేవలు నిరాటకంగా కొనసాగిస్తూ పార్సిల్స్ సేవల్లో తనదైన ముద్ర వేసుకున్నది. ప్రైవేటు పార్సిల్ సర్వీసులకు దీటుగా సేవలు విస్తృతం చేసి సరుకుల రవాణాలో ముందువరుసలో నిలబడింది. ఇందుకోసం ఆర్టీసీ యాజమాన్యం, అధికారులు, కార్మికులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టారు. కేవలం రెండేండ్లల్లోనే మెదక్ రీజియన్ పరిధిలో 18 పాయింట్లను ఏర్పాటు చేసి 4,05,765 పార్సిళ్లను చేరవేసింది. కార్గో పాయింట్లలో బుకింగ్ చేసుకుని ఇంటింటికీ సరఫరా చేస్తున్నది. ఆర్టీసీ అందించిన సేవలకు రూ.3,55,70,768 కోట్ల ఆదాయం సమకూర్చికోవడం సంతోషకరం. ప్రస్తుతం కార్గోతో పార్సిళ్లను వినియోగదారులు ఇచ్చిన అడ్రస్‌లకు చేరవేస్తే వచ్చే ఆదాయంతో వేతనాల చింతలేదనే కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కార్గో బస్సులతో రూ.17లక్షలు..
ఆర్టీసీ అధికారులు కేవలం వినియోగదారులు బుకింగ్ చేసిన వస్తువులను చేరవేసినందుకు కార్గో బస్సులు ద్వారా రూ.17 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 8 డిపోల పరిధిలో 4 ప్రత్యేక కార్గో బస్సులు నడుపుతూ ఆర్టీసీ అధికారులు ఆదాయాన్ని సమకూర్చుకోవడం విశేషం.
కార్గో సేవలు వినియోగించుకోవాలి..
ఆర్టీసీ యాజమాన్యం నూతనంగా తీసువచ్చిన కార్గో సేవలను ప్రయాణికులు, వినియోగదారులు వినియోగించుకోవాలి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, హుస్నాబాద్, దుబ్బాక డిపోల్లో కార్గో పాయింట్లు ఏర్పాటు చేశాం. పార్సిల్, కొరియర్ సర్వీసులతో ఆయా డిపోల పరిధిలోని పట్టణాల్లో ఇంటింటికీ సేవలు అందజేస్తున్నాం. త్వరలో మరిన్ని పాయింట్లు పెంచి సేవలందించేందుకు యాజమాన్యం కృషి చేస్తున్నది. హైదరాబాద్‌లోని వాణిజ్య, వ్యాపారులు సరుకులు ఎక్కువగా ఉంటే కార్గో బస్సుతో రవాణా చేసేందుకు వీలు కల్పిస్తున్నాం.
– సుదర్శన్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, సంగారెడ్డి
