చేర్యాల, జూన్ 19 : వంట తయారీ కోసం గృహిణిలు నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌కూ కాల పరిమితి ఉంటుందనే విషయం చాలా మందికి వినియోగదారులకు తెలియదు. దేశంలో తయారయ్యే ప్రతి వస్తువుకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియక ప్రమాదాలకు కారణం కావడంతో పాటు గ్యాస్ సైతం నష్టమవుతున్నది. కాలం చెల్లిన సిలిండర్లను వినియోగించడం ప్రమాదకరం. అందుకే కాలపరిమితి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గడువు తేదీ ముద్రణ
సిలిండర్‌పై ఉన్న రింగ్ కింది భాగంలో మూడు ఇనుప పట్టీలు ఉంటాయి. వాటిలో ఒక దానిపై లోపలి వైపు సిలిండర్ గడువు తేదీ ముద్రించి ఉంటుంది.అయితే సిలిండర్‌కు వేసి ఉన్న అంకెలు, తేదీలను చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ రింగు కింద భాగంలో లోపలి వైపు ముద్రించి ఉన్న తేదీలో 12 నెలలను నాలుగు భాగాలుగా విభజించి ప్రతి మూడు నెలలకు ఒక ఆంగ్ల అక్షరం చొప్పున రాసి ఉంటుంది. సంవత్సరంలో 12 నెలలను నాలుగు భాగాలుగా విభజించి వాటికి ఆంగ్ల భాషల్లోని మొదటి నాలుగు అక్షరాలు ఏ,బీ,సీ,డీ అని సూచించారు.
అందులో ఏ అక్షరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు, బీ అక్షరం ఏప్రిల్, మే, జూన్ నెలలకు, సీ అక్షరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు, డీ అక్షరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలను సూచిస్తాయి. సిలిండర్ పై ఏ,బీ,సీ, డీ కేటగిరీల వారీగా కాలపరిమితి తేదీలు ఉంటాయి.ఆ నెల ఆధారంగా సిలిండర్ గడువు ముగిసిందని గుర్తించాలి. గ్యాస్ సిలిండర్‌ను ఎప్పటికప్పుడు వినియోగిస్తే నాణ్యమైన గ్యాస్ అందడంతో పాటు ప్రమాదం జరిగే అవకాశం ఉండదు.
ఖాళీ సిలిండర్ కాలపరిమితి ఏడేండ్లు
ఖాళీ సిలిండర్లకూ కాల పరిమితి ఉంది. అయితే ఇది వినియోగదారులకు సంబంధం లేదు. ఖాళీ సిలిండర్ కాలపరిమితి ఏడేండ్లు. తయారీదారులు తమ వద్ద రికార్డుల్లో లేని గ్యాస్ నంబర్ల ప్రకారం ఏడేండ్లు దాటిన సిలిండర్లను డీలర్ల నుంచి వెనక్కి తెప్పించుకుని పరీక్షస్తారు. ఏ మాత్రం వినియోగ యోగ్యం కాని, నాణ్యత లేని సిలిండర్లను తయారీదారులు పక్కనపెడతారు. కొందరు సిలిండర్లను కొనుగోలు చేసిన తర్వాత నెలల తరబడి వాడకుండా నిల్వ ఉంచుతారు, మరికొందరు బ్లాక్‌లో కొని మరీ వాడుతుంటారు.అయితే సిలిండర్లపై ముద్రించిన గడువు తేదీలోగా వాడితేనే ఉత్తమం. కాలం చెల్లిన సిలిండర్లు పేలే అవకాశం ఉంది. వాటిని గుర్తించి సంబంధిత డీలర్లకు తిరిగి ఇచ్చేయాలి.