మెదక్ అర్బన్, జూన్19: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతివేగం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతోనే జరుగుతున్నాయన్నారు. చేగుంట పోలీస్స్టేషన్ పరిధిలోని మాసాయిపేట్ గ్రామ శివారులోని రాశి సీడ్స్ కంపెనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద కారణాలు తెలిపారు.
ఈ నెల 15న తెల్లవారుజామున 4 గంటలకు వికాస్ బాసరలో సరస్వతీ అమ్మవారికి పూజలు చేయించి, టీఎస్ 09 ఈబీ 0737 నంబరు గల హోండా సిటీ కారులో హైదరాబాద్కు తన కుటుంబ సభ్యులు, మిత్రుడితో కలిసి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ఎన్హెచ్ 44 రోడ్డులో చేగుంట పోలీస్స్టేషన్లో పరిధిలోని స్టేషన్ మాసాయిపేట్ గ్రామ శివారులో బోల్తా పడింది.
దీనికి కారణం వికాస్ నిద్రావస్థలోకి వెళ్లడంతో, ఎదురుగా వెళ్తున్న లారీని తప్పించబోయి, ఎడమ వైపునకు కార్ స్టీరింగ్ ఒక్కసారి తిప్పడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడిందని అన్నారు. ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న చిన్నారి అక్కడికక్కడే మృతిచెందిందన్నారు. వాహనాలు నడిపేటప్పుడు అలసటగా ఉన్నా లేక నిద్ర వచ్చినా ఆ సమయాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగించవద్దన్నారు. చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి సీటు బెల్టు పెట్టుకోకపోవడం, వాడకపోవడమే కారణమని తెలుస్తున్నదన్నారు. చిన్న పిల్లలు ఉంటే వారికి తప్పనిసరిగా చైల్డ్ సేఫ్టీ సీట్ ఉండాలన్నారు.