సదాశివపేట, జూన్ 19: ఆగి ఉన్న ట్రాక్టర్‌ను కర్ణాటకకు చెందిన డీలక్స్ బస్సు ఢీకొట్టి, భార్యాభర్తలు మృతి చెందిన ఘటన సదాశివపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బైపాస్‌రోడ్డు జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కర్ణాటకకు చెందిన (కేఏ38ఎఫ్118) రాజహంస డీలక్స్ బస్సు బైపాస్ రోడ్డుపై ఆగి ఉన్న ఏపీ23ఈ2726 నంబర్ గల ట్రాక్టర్‌ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్లో ఉన్న సామెల్ (55), అతని భార్య రత్నమ్మ (50) ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అనంతరం వారిని అంబులెన్స్‌లో సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ సామెల్ ఆయన భార్య రత్నమ్మ ఇద్దరూ మృతిచెందారు. మృతులు ఎల్ అండ్ టీలో కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ట్రాక్టర్లో మొక్కలు తెచ్చి జాతీయ రహదారిపై నాటుతారు. ఈ క్రమంలో ట్రాక్టర్లో నుంచి మొక్కలు తీస్తుండగా కర్ణాటకకు చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌కు కాలు విరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న కొంతమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులు కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన వారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ప్రమాదాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.