అందోల్, జూన్ 14 : గత ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట జేబులు నింపుకొన్నారు తప్ప, ప్రజలకు చేసిందేమిలేదని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జేఎన్టీయూ తెచ్చామని చెప్పుకొంటున్న కాంగ్రెసోళ్లు కనీసం భూములు కోల్పోయిన రైతులకు కుటుంబంలో ఒక్కరికి పర్మినెంట్ ఉద్యోగమని నమ్మించి, తాత్కాలిక ఉద్యోగం ఇప్పించిన పాపాన కూడా పోలేదన్నారు. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు,ప్రజల కోసం మంచి చేస్తున్న చూసి ఓర్వలేని వారు టీఆర్ఎస్ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. కెనాల్ కాల్వల్లో భూములు కోల్పొయిన రైతుల పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉందన్నారు. బామ్మర్దికి కాంట్రాక్టులు అప్పజెప్పి జేబులు నింపుకొన్నది వీరు కాదా.. అని పరోక్షంగా దామోదరపై విమర్శలు చేశారు. బాబూమోహన్ కూడా తన కుటుంబ సభ్యులకే బాగు చేశాడు తప్ప ప్రజల కోసం ఏం చేశాడో చెప్పాలన్నారు. ఈ నెల 20న తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలిపారు.
రూ.36.74 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకం కింద 2 ప్రధాన డిస్టిబ్యూటరీ కెనాల్స్ ఏర్పాటు చేశారన్నారు. వీటి వల్ల అందోల్, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల్లోని 14 గ్రామాలకు చెందిన సుమారు 10 వేల ఎకరాలు, మరో సబ్సిడరీ కెనాల్స్ (పిల్ల కాల్వలు) ద్వారా మరో 3 వేల పై చిలుకు ఎకరాలు వెరసి 14 వేల ఎకాలకు సాగు నీరంది,అవి సశ్యశ్యామలం కానున్నాయన్నారు. ఈ నెల 20న ఉదయం 11 గంటలకు సాయిపేట శివారులోని సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పంప్‌హౌస్‌ను మంత్రి ప్రారంభించి వెంటనే తాలెల్మ గడ్డ వద్ద నీటి స్లూయిస్‌ను ఆయన ప్రారంభిస్తారన్నారు. అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు మఠం భిక్షపతి,అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఎంపీపీ అధ్యక్షుడు జోగు బాలయ్య,మాజీ అధ్యక్షుడు రామాగౌడ్,ఎత్తి పోతల పథకం చైర్మన్ లింగాగౌడ్, పుల్కల్ మండల టీఆర్ఎస్ అధ్మక్షుడు మాచర్ల విజయ్ కుమార్,ఎంఏంసీ డైరెక్టర్ శ్రీనివాస్,మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్లు దుర్గేశ్, కోరబోయిన నాగరాజు, నాయకులు రత్నం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.