మెదక్(నమస్తే తెలంగాణ)/మెదక్ అర్బన్, జూన్ 14: రానున్న వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఏ విధమైన సేవలు అందించడానికైనా సిద్ధంగా ఉండాలని జిల్లా సిబ్బందికి పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉండే సమయాల్లో ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు, శిథిలావస్థలో ఉన్న నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమతమ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్యామ్‌లు, చెరువులు, కుంటలు, అలుగు పారే ప్రదేశాలను గుర్తించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ముంపు బాధితులకు అవగాహన కల్పించాలన్నారు. నది ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం పంట పొలాలకు వెళ్లే రైతులు బోరు మోటర్ వేసే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే డయల్ 100, పోలీసు కంట్రోల్ రూం 08452-223533, 7330 671900కి సమాచారం అందించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి సున్నితమైన హింసాత్మక సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మత పెద్దలు, గురువులు, హితబోధకులు ఎలాంటి ఉద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు. హింసాత్మక సంఘటనల వల్ల ఎవరూ కూడా సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని, పోలీస్ శాఖ నుంచి ఎవ్వరికీ ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ శాంతి భద్రతల సంరక్షణ కోసం పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు.