వానకాలం సాగు ఏర్పాట్లలో రైతన్నలు బిజీ అయ్యారు. మరో రెండు, మూడు రోజుల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉండడంతో దుక్కులు దున్ని భూములు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సారి వరికి బదులు ఇతర పంటలుగా పత్తిని వేసేందుకు అత్యధిక శాతం రైతులు మొగ్గుచూపుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 7.15,537 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ భావిస్తుండగా, అత్యధికంగా 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గత సీజన్లో క్వింటాలు ధర రూ.10 నుంచి 12వేల వరకు ధర పలకడంతో ఈ సారి కూడా మళ్లీ ఆ స్థాయిలోనే లాభాలు రావొచ్చనే ఉద్దేశంతో పత్తి సాగుపై దృష్టి సారించారు. ఇందుకోసం 7,98,000 ప్యాకెట్ల విత్తనాలు అవసరం అవుతాయని అంచనా వేస్తుండగా, విత్తనాలు రైతులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నకిలీలకు చెక్ పెట్టేందుకు మండలం నుంచి జిల్లా స్థాయి వరకు స్పెషల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయడంతో పాటు డీలర్లు ఆన్లైన్ ద్వారా విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
సంగారెడ్డి, జూన్11 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు జిల్లా రైతాంగం సన్నద్ధమవుతున్నది. రుతుపవనాలు ముందుగానే వస్తాయని, వర్షాలు బాగానే కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతులు విత్తనాలు విత్తుకునేందుకు దుక్కులు దున్నుకుని భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 7,15,537 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 4 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తారని అధికారులు చెబుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉండడంతో పాటు పత్తికి గిట్టుబాటు ధర లభిస్తుండడంతో జిల్లాలోని రైతులు మొగ్గు చూపుతున్నారు.
3.99 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
జిల్లాలోని 3.99 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పత్తి సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్త్తున్నది. దీని ఫలితంగా జిల్లాలో 4 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన పత్తి విత్తనాలు సమకూర్చడంపై అధికారులు దృష్టి సారించారు. వానకాలంలో రైతులు వరి తగ్గించి పత్తి, కంది, సోయాబీన్ పంటల సాగుకు ఆసక్తి చూపాలని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైతులు పత్తి, కంది పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.

ఏటా పెరుగుతున్న పత్తి రైతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లాలో పత్తి సాగు చేస్తున్న రైతుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. 2022 వానకాలం సీజన్లో సైతం రైతులు పత్తి సాగుకు ఆసక్తిచూపుతున్నారు. గతేడాది 3.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ సీజన్లో 4 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేసే అవకాశం ఉన్నది. సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి, రాయికోడ్, వట్పల్లి, నారాయణఖేడ్ మండలాల్లో రైతులు అధికంగా పత్తి సాగు చేస్తున్నారు.
చీడపీడల బెడద తక్కువే..
ఇతర పంటలతో పోలిస్తే పత్తి పంట చీడపీడలను తట్టుకునే అవకాశం అధికంగా ఉంటుంది. దీంతో పాటు దిగుబడి అధికంగా వస్తున్నది. మిగితా పంటలతో పోలిస్తే గిట్టుబాటు ధర కూడా ఎక్కువ. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. గత సీజన్లో క్వింటా పత్తి ధర రూ.10 నుంచి 12 వేల వరకు పలికింది. పత్తి సాగు లాభసాటిగా ఉండటంతో జిల్లా రైతులు పత్తి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ సీజన్లోనూ సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి, రాయికోడ్, వట్పల్లి, నారాయణఖేడ్తో పాటు జిల్లాలోని ఇతర మండలాల్లోనూ పత్తి సాగు చేసే అవకాశం ఉన్నది. వానకాలం సీజన్లో 7,98,000 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
విత్తనాల కొరత లేకుండా చర్యలు
పత్తి విత్తనాల కొరత లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టేలా వ్యవసాయ శాఖ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్పెషల్ టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్సు అధికారులు తనిఖీలు ప్రారంభించారు. డీలర్లు ఆన్లైన్లో పత్తి విత్తనాలు విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీంతో నకిలీ పత్తి విత్తనాల బెడద రైతులకు తప్పినట్టే.