సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, జూన్ 11: బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్న టెట్ పరీక్ష మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 123 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పేపర్-1 పరీక్షకు 70 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 16,790 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పేపర్-2కు 53 పరీక్షా కేంద్రాల్లో 12,359 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. సంగారెడ్డి, జోగిపేట, అమీన్పూర్, రామచంద్రాపురం, పటాన్చెరు, సదాశివపేట, జహీరాబాద్‌లలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 849 మంది ఇన్విజిలేటర్లు, 123 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 123 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. అభ్యర్థులు తమ సందేహాల కోసం 8143558112 నంబరులో సంప్రదించొచ్చని తెలిపారు.
మెదక్‌లో..
మెదక్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో పేపర్-1కు 36 పరీక్షా కేంద్రాలు, పేపర్-2కు 27 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షకు మొత్తం 14,762 మంది హాజరు కానున్నారు. ఇందులో మొదటి పేపర్‌కు 8,605 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం జరిగే రెండో పేపర్‌కు 6,157 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. నిర్ణీత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.

సకాలంలో చేరుకోవాలి
టీఎస్ టెట్ పరీక్షకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు ఉన్న విద్యా సంస్థల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. తమ పరీక్షా కేంద్రాలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. ఎలాంటి మాల్‌ప్రాక్టీసింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవు.
– హనుమంతరావు, కలెక్టర్, సంగారెడ్డి