సంగారెడ్డి అర్బన్, జూన్ 11: సైబర్, ఆన్లైన్ మోసాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్, ఆన్లైన్ మోసాలను నియంత్రించేందుకు జిల్లా పోలీస్ శాఖ, ఎస్పీ రమణకుమార్ ఆదేశాల మేరకు సంగారెడ్డిలో సైబర్ సురక్షిత-జాతీయ భద్రత నినాదంతో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ బాలాజీ జెండా ఊపి ప్రారంభించారు. ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలంటూ నినాదాలు చేస్తూ ఐబీ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్లో జరుగుతున్న అనేక రకాల సైబర్ నేరాల నుంచి ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ ర్యాలీ నిర్వహించామన్నారు.
ఆన్లైన్లో ఎలాంటి లోన్ యాప్‌లు డౌన్ లోడ్ చేసుకోవద్దని, ఏ బ్యాంకులు ఓటీపీలు అడగవని, ఓటీపీలు షేర్ చేసి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. ఆన్లైన్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాలకు దూరంగా ఉండాలన్నారు. మారు వేషంలో సైబర్ నేరగాళ్లు పొంచి ఉంటారని, జాగ్రత్తలు పాటించకపోతే మోసాలకు గురికాక తప్పదని అన్నారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందిచాలన్నారు. ఆన్లైన్ మోసాలను అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ సీఐ రమేశ్, రూరల్ సీఐ శివలింగం, ట్రాఫిక్ సీఐ రాజు, ఎస్సైలు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు, పోలీస్ సిబ్బంది, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.
