నారాయణఖేడ్, జూన్ 11: ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో చిరుధాన్యాలు దోహదపడతాయని, పూర్వం చిరుధాన్యాల ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన జీవనం గడిపారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌లోని ఐకేపీ కార్యాలయంలో శనివారం స్వయంశక్తి అగ్రికల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. చిరుధాన్యాలతో ఆహార ఉత్పత్తుల తయారీ కోసం నారాయణఖేడ్ మండల పరిధిలోని జూకల్‌లో ఒక యూనిట్ త్వరలో ప్రారంభంకానున్నదని తెలిపారు. మహిళా సంఘాలు సైతం ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. రైతులు పండించిన చిరుధాన్యాలను స్వయంశక్తి అగ్రికల్చర్ ఫౌండేషన్‌తో పాటు పలు రైతు సంఘాలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. చిరుధాన్యాల సాగుపై రైతులందరూ ఆసక్తి చూపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయంశక్తి అగ్రికల్చర్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీర్శెట్టి మాట్లాడుతూ ప్రస్తుతం చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అత్యధికులు చిరుధాన్యాల ఆహారపదార్థాలపై మక్కువ చూపుతున్నారన్నారు. విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని, చిరుధాన్యాలను సాగు చేసి లబ్ధిపొందాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం టిక్యానాయక్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు రూపారాణి, నాయకులు రవీందర్‌నాయక్, ఎం.ఏ.నజీబ్, రమేశ్చౌహాన్, సాయిలు, జగప్ప తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ప్రమాద బాధితులకు చెక్కుల అందజేత
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబాలకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి చెక్కులను అందజేశారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ మండలం అబ్బెందకు చెందిన దండి రేణుక, నాగల్గిద్ద మండలం గొందేగామ్కు చెందిన నడిమిదొడ్డి బాబు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ విద్యుత్ ప్రమాద బీమా ద్వారా రూ.5 లక్షల చెక్కులను అందజేశారు. విద్యుత్ ప్రమాదం కారణంగా గేదేలు, ఆవులు మృతి చెందిన వారికి రూ.40 వేల చెక్కులను అందజేశారు.
గిరిజనుల అభ్యున్నతి కోసమే ‘గిరివికాస్’
గిరిజన రైతుల అభ్యున్నతి కోసమే కేసీఆర్ ప్రభుత్వం సీఎం గిరివికాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నారాయణఖేడ్ మండలం గౌరారం తండాలో గిరివికాస్ పథకంలో భాగంగా బోరు వేసే పనులను ఎమ్మెల్యే ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహించి ప్రయోజనం కల్పిస్తుందన్నారు. ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం రూ.3 లక్షల వరకు వెచ్చిస్తుందని, నారాయణఖేడ్ నియోజకవర్గానికి 89 యూనిట్లు మంజూరయ్యాయన్నారు. దీనిని గిరిజనులు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు.
గడికట్ట మైసమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి నారాయణఖేడ్ పట్టణంలోని గడికట్ట మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పునర్మిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి కాలనీవాసులు అందిస్తున్న సహకారం తదితర విషయాలను ఏఎంసీ వైస్‌చైర్మన్ విజయ్ బుజ్జి, ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం కాలనీవాసులు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని శాలువా, పూలమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు మూడ రామకృష్ణ, ప్రభాకర్, ముజామిల్, అభిషేక్‌శెట్కార్, మహేశ్రామ్, లయక్, మశ్చేందర్ తదితరులు పాల్గొన్నారు.