మెదక్ రూరల్, జూన్ 9 : ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో, పిడుగు పడుతుందో తెలియదు. వర్షాలు , పిడుగుపాటుకు గురై మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు కొన్నిరోజులుగా జిల్లాలో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనల నుంచి రైతులు, ప్రజలు అప్రమత్తం చేసి వారికి అండగా నిలిచేందుకు కేంద్ర వాతావరణశాఖ ప్రత్యేక యాప్లను రూపొందించింది. వీటిని డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఎక్కడ పిడుగు పడుతుందో ఏ సమయంలో వర్షం కురుస్తుందో.. వంటి విషయాలను ముందుగా తెలుసుకోవచ్చు. రైతులు,ప్రజలకు ఉపయోగపడేలా మూడు ప్రధాన సమాచార వేదికలను భారత వాతావరణ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. రాబోయే ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఈ యాప్ ద్వారా తెలుసుకునే వీలు కలుగుతుంది.
మేఘధూత్ యాప్..
పంటల సంరక్షణకు మందుల పిచికారీ వేళ వర్షాలు కురిస్తే రసాయన ఎరువులు వృథా అవుతూ ఉంటాయి. ఈ మేఘదూత్ యాప్ను ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వాతవరణ వివరాలను సంక్షిప్త సందేశం ద్వారా అందిస్తుంది. రాబోయే ఐదు రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచన, ఆకాశం మేఘావృతం అవుతుందా, ఈదురు గాలులు ఏమేరకు ఏ దిశగా వీస్తాయనే సమాచారం తెలుసుకోవచ్చు.
రెయిన్ అలారం యాప్
స్మార్ట్ఫోన్లో రెయిన్ అలారం యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈ యాప్ ద్వారా రైతులు ఎవరైనా సూమరు 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వర్షం పడే సూచనలున్నాయో.. వంటి సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. తద్వారా అకాల వర్షంతో ధాన్యం తడిసి పోకుండా రైతులు కాపాడుకోవచ్చు.
దామినీ యాప్
మే నెలలో ఈదురు గాలులతో అకాల వర్షాలు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొలాల వద్దకు వెళ్లిన రైతులు, ప్రయాణాల్లో ఉన్న వారు వర్షం ప్రారంభం కాగానే పక్కనే ఉన్న చెట్ల కిందకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చెట్లు సురక్షతం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ దామినీ యాప్ ద్వారా 5 నుంచి 20 నిమిషాల్లోపు 20 కిలో మీటర్ల పరిధిలో ఎక్కడ పిడుగు పడుతుందో సమాచారం అందిస్తుంది.