మెదక్ మున్సిపాలిటీ, జూన్ 8: విద్యార్థుల రక్షణ చర్యల్లో భాగంగా పాఠశాల, కళాశాలల బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలి. బస్సు డ్రైవర్లు ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండి 60 ఏండ్లకు మించకుండా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి బస్సుకు అటెండర్‌తో పాటు విద్యార్థు లు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవా లి. వీటితో పాటు రక్షణ చర్యలు తీసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో బస్సులను జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి ఫిట్నెస్ చేయించుకోవాలి. రవాణా శాఖ అధికారులు బస్సుల కండీషన్‌తో పాటు ఇతర అంశాలను పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా ఉంటేనే బస్సులకు ఫిట్నెస్ చేస్తారు. నిబంధనలు పాటించని బస్సులకు అనుమతులు నిరాకరిస్తారు. అధికారులు అనుమతించిన బస్సులను మాత్రమే యాజమాన్యా లు విద్యార్థుల రవాణా సౌకర్యానికి వినియోగించాలి. జూన్ 13 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మే 15 నుంచి బస్సు ఫిట్నెస్ ప్రారంభం కాగా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఇప్పటి వరకు స్పందన లేదు. జిల్లా వ్యాప్తంగా 277బస్సులు ఉండగా కేవలం 127బస్సులు మాత్రమే ఫిట్నెస్ చేయించారు. నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. పిట్నెస్ గడువు ముగిసిన తరువాత బస్సులకు ప్రతి రోజు జరిమనా విధించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఫిట్‌గా ఉంచాల్సిన బాధ్యత యాజమాన్యాలదే..
పాఠశాలల బస్సులకు ఫిట్‌గా ఉంచాల్సిన బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలపై ఉంటుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను బస్సులో అందుబాటులో ఉంచాలి. రవాణా శాఖ నిబంధనలు జీవో 35ప్రకారం ప్రతి బస్సు ఫిట్నెస్ కలిగి ఉండాలి. అన్నింటిలో ఫస్ట్‌ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచాలి. పిల్ల లు సులభంగా ఎక్కడానికి అదనపు మెట్లు(కింది వరకు) బిగించాలి. బస్సు నిలిపిన సమయంలో కిందికి దించి క్షేమం గా ఇంటి వెళ్లేలా చూడాలి. బస్సు నడిపే డ్రైవర్ ఆరోగ్య విషయంలో యాజమాన్యాలు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. డ్రైవర్ వయస్సు 60 ఏండ్లలోపే ఉండాలి. పసుపు పచ్చ కలర్లో ఉండే బస్సుకు అన్ని వైపుల పాఠశాల బస్సుగా పెద్ద అక్షరాలతో రాసి ఉండాలి. నాలుగు వైపులా ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేయాలి. అత్యవసర ద్వారాలు పనిచేస్తూ ఉండాలి. బస్సును డ్రైవర్ వేగంగా నడిపిన సందర్భాల్లో యా జమాన్యాలు, ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసే విధంగా బస్సు వెనుక భాగంలో ఫోన్ నంబర్లు రాయించాలి.
డ్రైవర్ ఇవి పాటించాలి..
పాఠశాలల బస్సులు నడిపే డ్రైవర్లు రవాణా శాఖ జారీ చేసి న బ్యాడ్జీ నంబర్ కలిగి ఉండాలి. విదిగా కంటి పరీక్షలు చేయి ంచుకున్న సంబంధిత సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అడిగిన సందర్భాల్లో చూపించాల్సి ఉంటుంది. బస్సులో విధిగా రిజిస్టర్ ఉండాలి. ఉదయం వచ్చిన పిల్లలు, సాయంత్రం తిరిగి బస్సులో ఎక్కించిన పిల్లల సంఖ్యను అందులో పొందుపర్చాలి.
ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం..
ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్డుపైకి వస్తే సీజ్ చేస్తాం. అనుమతులు లేకుండా పాఠశాలల బస్సులు నడిపినా నిబంధనలు విస్మరించినా కఠిన చర్యలు తప్పవు. పాఠశాలల బస్సులకు సంబంధించిన నిబంధనల్లో రాజీపడే ప్రసక్తే లేదు. విద్యార్థుల సంరక్షణకు ప్రభుత్వ సూచనలను యాజమాన్యాలు కచ్చితంగా పాటించాల్సిందే. 15 ఏళ్ల కాలపరిమితి దాటిన బస్సులను రోడ్డుపైకి తీసుకురావడానికి వీల్లేదు. జిల్లాలో 277బస్సులు ఉంటే కేవలం 127 బస్సులకు మాత్రమే పిట్నెస్ చేయించుకున్నారు. గడువులోపు ఫిట్నెస్ చేయించుకోవాలి.
-శ్రీనివాస్‌గౌడ్, మెదక్ డీటీవో