
కొండపాక, నవంబర్ 19: సిద్దిపేట ప్రజల చెంతకు త్రీస్టార్ హోటల్ రాబోతుందని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణానికి సమీపంలో కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో నాగులబండ వద్ద నిర్మిస్తున్న టూరిజం హోటల్‌ను శుక్రవారం మంత్రి హరీశ్‌రావు టూరిజం డెవలప్మెంట్ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్మాణ పనులు పరిశీలించి, పలు సూచనలు చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట ప్రజల చెంతకు పర్యాటక హోటల్ ..
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సిద్దిపేట పట్టణానికి సందర్శకులతో పాటు ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి తాకిడి పెరిగింది. ముఖ్యమైన అధికారులు, విదేశాల నుంచి వచ్చిన వారు, ఇతర రాష్ర్టాల ప్రతినిధులు సిద్దిపేట ప్రాంతంలో పర్యటించిన సందర్భాల్లో వారు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాంటి వారి కోసం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోని నాగులబండ వద్ద త్రీస్టార్ స్థాయి టూరిజం హోటల్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. ఇందులో మూడు సూట్ రూమ్స్, 28 గెస్ట్ రూమ్స్, రెస్టారెంట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తక్కువ ధరకు మంచి టిఫిన్, భోజనంతో పాటు సౌకర్యవంతమైన వసతి వెయ్యి మందితో ఫంక్షన్ చేసుకునే వీలుగా బాంకెట్‌హాల్ ఏర్పాటు ఉన్నాయన్నారు. సిద్దిపేట ప్రజల అవసరాల నిమిత్తం త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే, సిద్దిపేట కళలకు, కళాకారులకు పెట్టింది పేరు అని, ఆ కళను ఉట్టిపడేలా కాపు రాజయ్య, బాతిక్ బాలయ్య, రుస్తుం, చేర్యాల నకాశి చిత్రపటాలను హోటల్లో ప్రత్యేక ఆకర్శణగా ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట కళా బ్రాండ్‌ను విస్తరించేలా అన్ని గెస్ట్రూముల్లో చిత్ర పటాలతో ఆకట్టుకోవాలన్నారు.