కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతు సంక్షేమం ఏమాత్రం పట్టడం లేదు. ఇష్టారాజ్యంగా పెట్రో, డీజిల్ ధరలు పెంచడంతో ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడులు పెరిగి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది చాలదన్నట్లుగా బీటీ పత్తి విత్తన ధరలు పెంచేందుకు అనుమతించింది. గతేడాది బీటీ-2 పత్తి విత్తన ప్యాకెట్ రూ. 767 ఉండేది. ఈ ఏడాది దాని ధర రూ.810కి చేరింది. గతేడాదితో పోలిస్తే ఒక్కో ప్యాకెట్‌పై రూ.43 పెరిగింది. తద్వారా ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే రైతులపై రూ.3.43 కోట్ల అదనపు భారం పడనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోనే పత్తి పండిస్తారు. గతేడాది వానకాలం జిల్లాలో 3,61,166 ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది మరో 10శాతం సాగు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు గానూ మొత్తం 7.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
సదాశివపేట, మే 29: పత్తి సాగు లాభసాటిగా ఉండడంతో రైతులు వానకాలం సీజన్లో ఆ పంట సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అత్యధికంగా పత్తిని సంగారెడ్డి జిల్లాలో సాగు చేస్తారు. ఆ తర్వాత మెదక్, సిద్దిపేట జిల్లాలోని దుబ్బా క, గజ్వేల్, హుస్నాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో సాగుచేస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పత్తి రైతుకు విత్తన పోటు తప్పడంలేదు. గతేడాది పత్తి బీటీ-2 విత్తన ప్యాకెట్ రూ. 767 ఉండే ది. ఈ ఏడాది రూ.810కి చేరింది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.43 పెరిగింది. దీంతో సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా రైతులపై రూ.3.43 కోట్ల భారం పడనున్నది. మోదీ స ర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై పత్తి రైతులు మండిపడుతున్నారు.
7.98లక్షల విత్తనాలు అవసరం
గతేడాది వానకాలం సీజన్ జిల్లాలో 7,15,537 ఎకరా ల్లో పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 3,61,166 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ఈ ఏడాది మరో 10 శాతం పత్తి సాగు పెరిగే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 7.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో బీటీ-2 రకం పత్తి విత్తనాలు వేస్తారు. బీటీ-2 విత్తన ప్యాకెట్ 470 గ్రాములు ఉంటుంది. గతేడాది పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.767 ఉండగా, ఈ ఏడాది రూ.810కి పెరిగింది. ఒక్కో ప్యాకెట్‌పై రూ.43ల భారం పడుతున్నది. పత్తి విత్తన ధర పెరుగుదలకు బీజేపీ సర్కారు తీసుకుంటున్న విధానాలే కారణమని రైతులు మండిపడుతున్నారు.
రూ.3.43 కోట్ల భారం..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలు ఇబ్బందిపడుతున్నారు. పెరిగిన పెట్రో, డీజిల్, ఇతర ముడి సరుకుల ధరల ఆధారంగా పత్తి విత్తన కంపెనీలు రేట్లు నిర్ణయిస్తారు. బీటీ-2 పత్తి విత్తనాలు తయారు చేసే కంపెనీలు వందల సంఖ్యలో ఉన్నా, రైతులు మాత్రం తమకు నచ్చిన కొన్ని కంపెనీల విత్తనాలు మాత్రమే కొంటారు. రైతు ఎకరం పంట వేయడానికి 470 గ్రాముల ప్యాకెట్లు రెండు అవసరమవుతాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 7.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఒక్కో ప్యాకెట్‌పై రూ.43 ధర పెంచడంతో రైతులపై రూ.3.43 కోట్ల భా రం పడనున్నది.
సంగారెడ్డి జిల్లా పెట్టింది పేరు…
పత్తి సాగుకు సంగారెడ్డి జిల్లా పెట్టింది పేరు. ఈ జిల్లాలో అనుకూలమైన భూములు, వాతావరణం ఉండడంతో రైతులు కూడా అధిక దిగుబడులు సాధిస్తున్నారు. పత్తితో పాటు కంది, వేరుశనగ, పసుపు, అల్లం, చెరుకు పంటలు పండిస్తున్నారు. అత్యధికంగా పత్తి పంటనే పండిస్తున్నారు. వరి కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. మంజీరా, సింగూరు పరివాహక ప్రాంతంలోనే వరి సాగు చేస్తున్నారు.