
హవేళీఘనపూర్, నవంబర్ 14:అడవుల పరిరక్షణ, జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ రెండు అంశాలపై అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లా సరిహద్దు గ్రామం పోచారం అభయారణ్యం ఆవరణలో రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన వన విజ్ఞాన కేంద్రం ప్రకృతి ప్రేమికులతో పాటు సామాన్య ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నది. అడవులతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి.. అడవుల్లో ఉండే జంతువులు, వాటి సంరక్షణ, జిల్లాలో ఉన్న అటవీప్రాంతం, అడవిని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అటవీ శాఖ సిబ్బంది పనితీరు తదితర విషయాలను తెలుసుకునేందుకు ఈ విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పారు. ఇక్కడ అలుగు, ఎలుగుబంటి, అడవి పంది, తోడేలు, చుక్కల దుప్పి, ఉడుము, కొండ చిలువ, దూది చిలువ తదితర బొమ్మలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఐడీ) ఆధ్వర్యంలో సందర్శనకు వచ్చిన పర్యాటకుల అభిప్రాయాలు తెలిపేందుకు ఒక ఫీడ్బ్యాక్వాల్ను ఏర్పాటు చేశారు. ఇటీవల అమెరికా కౌన్సిల్ సభ్యులు పోచారం వన విజ్ఞాన కేంద్రంతో పాటు పోచారం అభయారణ్యాన్ని సందర్శించారు. అడవులతో కలిగే అభివృద్ధి, గిరిజనులకు ఉపాధి అవకాశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ అభయారణ్యం ప్రాముఖ్యత ఎల్లలు దాటుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.