అమీన్పూర్,మే12 : వేసవితాపానికి చల్లని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది చల్లని పానీయాలు తాగుతూ, చల్లని ప్రదేశాల్లో సేదదీరుతుంటే.. మరికొందరు చల్లని నీరు కలిగిన కుంటలు, సిమ్మింగ్ పూల్స్, చెరువులు వాగుల్లో జలకాలాడుతూ.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న అమీన్పూర్లో సహజసిద్ధంగా ఏర్పడిన ఓ కుంట ఇప్పుడు అలాంటి జలకాలాటలకు వేదికగా మారింది. అమీన్పూర్ పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో ఉన్న మెడికల్ డివైజెస్ పార్క్ సమీపంలో ఉన్న కొండలను కొంత కాలం కిందట తవ్వారు. ఆ కొండల నుంచి సేకరించిన రాళ్లను క్రషర్లో కంకరగా మార్చి దాన్ని భవన నిర్మాణాల కోసం తరలించారు. అయితే ఆ కొండలను పూర్తిగా తొలిగించలేదు. దీంతో వాటి మధ్యలో పెద్ద లోయలా స్థలం ఏర్పడింది. అందులో నీటి ఊట ఏర్పడి అదే క్రమంగా పెరిగింది. దీంతో అక్కడ చిన్నపాటి కుంట సహజసిద్ధంగా ఏర్పడింది. ఈ క్రమంలో ఇప్పుడు చుట్టు పక్కల ఉన్న ప్రాంత వాసులను ఆ కుంట ఆకర్షిస్తోంది. స్వచ్ఛమైన నీటితో ఏర్పడిన కుంట కావడంతో అందులో ఈత కొట్టేందుకు చాలా మంది నిత్యం అక్కడికి వెళ్తున్నారు.
ఎంతో సంతోషాన్నిస్తుంది..
ఈ కొలనులో స్నానం చేస్తే ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. దూర ప్రాంతం వెళ్లిన అనుభూతిని కల్గిస్తున్నది. ఫ్రెండ్స్‌తో కలిసి ఇక్కడ ఈత కొట్టేందు వస్తాం.. ఇక్కడికి రావడం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ కొలనును పరిశీలించి పర్యాటక ప్రాంతంగా తయారు చేయాలి. ఈ ప్రాంతంలో వేసవి సేద తీర్చుకునేందుకు వచ్చిన వారికి అపాయాలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలి.
-సాయి తరుణ్, అమీన్పూర్