మెదక్ అర్బన్, మే 5 : మారుతున్న కాలానికి అనుగుణం గా అందివచ్చే అవకాశాలను ఆర్టీసీ సంస్థ అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నది. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చడమే కాకుండా కార్గో సేవల ద్వారా మరింత చేరువైంది. అదే విధంగా వివాహల సమయంలో దూరప్రయాణం చేసేందుకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి మోసపోకుండా తక్కువ ధరకే బస్సులను అద్దెకు ఇస్తున్నది. నూతన వధూవరులకు సంస్థ తరపున కానుకలు అందిస్తూ సరికొత్తగా వ్యవహరిస్తున్నది. వివాహాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు మెదక్ ఆర్టీసీ డిపో నుంచి వివాహా ది శుభకార్యాలకు ఫిబ్రవరి నెలలో 40, మార్చి నెలలో 06 , ఏప్రిల్ నెలలో 20, మొత్తం 66 బస్సులను బుకింగ్ చేసుకున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో డీఎం తెలిపారు.
ఆన్లైన్లో బస్సుల బుకింగ్ ప్రారంభించిన ఆర్టీసీ
ఆర్టీసీ సంస్థ, ప్రైవేట్‌కు దీటుగా వినూత్న పద్ధ్దతిలో ప్రజల కు చేరువవుతుంది. బస్సులను శుభకార్యాలయాలకు అద్దెకు తీసుకోవాలని అనుకునేవారు ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. బుకింగ్ సమయంలోనే ఎలాంటి బస్సు కావాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలి? ఏ సమయానికి బస్సు కావాలి? అనేక విషయాలను చూసి, ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. చెల్లించా ల్సిన కిరాయిపై వెసులుబాటు కల్పించింది. డిపో వద్దకు వెళ్లి బుకింగ్ చేసుకోవాలనుకునేవారు ఆఫ్‌లైన్‌లో బస్సులను బు కింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో tsrtconline. in వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో బస్సులను బుకింగ్ చేసుకోవచ్చు.
30, 20, 15 శాతం రాయితీ అవకాశాలు..
నెల ముందు బస్సును బుకింగ్ చేసుకుంటే చార్జీలో 20 శాతం రాయితీ ఇస్తున్నది. అప్పటికప్పుడు బస్సును బుకింగ్ చేసుకుంటే చార్జీలో 15 శాతం రాయితీ. పెండ్లి వారిని ఆకట్టుకునేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ను రద్దు చేయడంతో ఆర్టీసీ బస్సుల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. విద్యార్థుల విహా రయాత్రకు చార్జీలో 30 శాతం రాయితీని కల్పిస్తుంది. దీనికి జిల్లా విద్యాధికారి నుంచి అనుమతి పత్రం తీసుకువస్తే 30, ఎలాంటి దృవ పత్రం లేకుంటే 20 శాతం రాయితీ ఇస్తుంది.
ప్రయాణికుల క్షేమమే లక్ష్యం..
ప్రయాణికుల క్షేమమే లక్ష్యంగా ఆర్టీసీ సంస్థ సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు బస్సులను అందుబాటులో ఉంచాం. ప్రయాణికులు ఇంటి నుంచే ఆన్లైన్లో బస్సులను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఒక నెల ముందుగా బస్సులను బుకింగ్ చేసుకుంటే 20 శాతం, అప్పటికప్పుడు బస్సు బుకింగ్ చేసుకుంటే 15 శాతం రాయితీని ప్రయాణికులకు కల్పిస్తుంది.
– ప్రణీత్‌కుమార్, మెదక్ ఆర్టీసీ డిపో డీఎం