కిడ్నీ జబ్బుల బారినపడిన వారి బాధలు వర్ణణాతీతం. డయాలసిస్ చేయించుకోవాలంటే గతంలో హైదరాబాద్‌లాంటి నగరాలకు రోగులు వెళ్లాల్సి వచ్చేది. కిడ్నీ రోగుల ఇబ్బందులను గుర్తించి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో మెదక్ జిల్లా దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. ఈ డయాలసిస్ కేంద్రంలో నాలుగు జనరల్ బెడ్లు, ఒక ప్రత్యేక బెడ్ సహా ఐదు బెడ్లు ఉండేవి. ఇప్పుడు మరో ఐదు బెడ్లు ఏర్పాటు చేశారు. 10 డయాలసిస్ యంత్రాలతో నిత్యం 40 మంది వరకు రోగులకు సేవలు అందిస్తున్నారు. జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులు సేవలు వినియోగించుకుంటున్నారు.
మెదక్, ఏప్రిల్ 30: మనిషి భాగాల్లో ముఖ్యమైనది కిడ్నీ. సరైన సమయంలో చికిత్స చేయకపోతే దాని ఫలితం వెంటనే కనబడుతుంది. కిడ్నీలు ఫెయిల్యూ ర్ అయితే మనిషి జీవితానికి అంతిమ క్షణాలే.. డ యాలసిస్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ వంటి వైద్యం చాలా ఖర్చుతో కూడినది. నిరుపేదలకు ఈ చికిత్సలు అంద ని ద్రాక్షే. అలాంటి ఖరీదైన డయాలసిస్ సేవలు మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో అందుతున్నాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో జిల్లా కేంద్ర దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయించారు. 2018 ఫిబ్రవరి 7న జిల్లా కేంద్ర దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. దవాఖానలో నాలుగు జనరల్ బెడ్లు, ఒక ప్రత్యేక బెడ్ సహా ఐదు బెడ్లతో కిడ్నీ రోగులకు సేవలు అందుతున్నాయి. ఇందులో వారానికి ఒకసారి కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. డయాలసిస్ ఒక్కో యంత్రం ఖరీదు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల చొప్పున మొత్తం 10 డయాలసిస్ యంత్రాలను జిల్లా కేంద్ర సర్కారు దవాఖానలో ఏర్పాటు చేశారు. కిడ్నీ ఫెయిల్ అయిన పేద రోగులు డయాలసిస్ చేయించుకునేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో సౌకర్యం కల్పించింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలు అంతా ఇంతా కాదు. వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ప్రైవేట్ దవాఖానల్లో బిల్లు ఎక్కువ కావాల్సిందే. వారి ఇబ్బందులను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తోంది. దీంతో రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు.
ఇతర జిల్లాల నుంచి రోగుల రాక…
గతంలో కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోవాలంటే హైదరాబాద్‌లోని నిమ్స్, కిమ్స్, నారాయణ హృదయాల దవాఖానలతో పాటు సంగారెడ్డిలో ఉన్న డయాలసిస్ కేంద్రాలకు వెళ్లేవారు. ఇప్పుడు మెదక్ జిల్లా కేంద్ర దవాఖానకు ఆయా మండలాలతో పాటు ఇతర జిల్లాల నుంచి రోగులు వస్తున్నారు.
వారానికి రెండు, మూడు సార్లు…
కిడ్నీ ఫెయిల్ అయిన రోగులను నెప్రాలజిస్టులు డయాలసిస్‌కు రెఫర్ చేస్తారు. ఆ రోగులకు అక్కడ డయాలసిస్ చేస్తారు. డయాలసిస్ కావాల్సిన వారి వివరాలను ఆరోగ్య శ్రీలో నమోదు చేయించి అనుమతి వచ్చిన తర్వాత డయాలసిస్ చేస్తున్నారు. రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన రోగులకు జీవితకాలం మొత్తం ఇక్కడ ఉచితంగా డయాలసిస్ చేయనున్నారు. రోగులకు ఉచితంగా రక్తం రావడానికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు అందజేస్తున్నారు. ఇంటికి వెళ్లడానికి అవసరమైన రవాణా చార్జీలు ఇస్తున్నారు.
కిడ్నీ రోగులకు చికిత్స చేసే విధానం…
కిడ్నీ సమస్యలకు నేడు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. డయాలసిస్ రెండు రకాలుగా ఉంటుం ది. అందులో ‘పెరిటోనియల్ డయాలసిస్‌తో కిడ్నీ పాడైన వ్యక్తి బొడ్డు నుంచి ట్యూబ్ వేసి డయాలసిస్ ఫ్లూయిడ్లతో చికిత్స అందిస్తారు. వారంలో రెండు, మూడు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంటి దగ్గర రోగి చేసుకోవచ్చు. రెండో రకం హిమో డయాలసిస్ వైద్యుల పర్యవేక్షణలో రక్తనాళాలతో మిషన్ ఉపయోగించి రక్తాన్ని శుద్ధిచేస్తారు. ఈ చికిత్స ఖర్చుతో కూడుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వంద మందిలో నలభై మంది పలు రకాల కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం జీర్ణవ్యవస్థలో జీర్ణం అయిన తర్వాత మిగిలిన పదార్ధాలు రక్తంలోకి కలిసి మూత్రనాళాల్లోకి ప్రవేశిస్తాయి. మూత్రపిండాలతో రక్తం, రక్తంలోని పదార్ధాలు పలు దఫాలుగా శుద్ధి చేయబడి అవసరమైన సోడియం, క్యాల్షియం, పొటాషియం, పాస్పెట్ లవణ పోషకాలకు శరీరానికి అందిస్తాయి. శుద్ధి చేయగా మిగిలిన వ్యర్ధాలను బయటకు పంపుతాయి. వీపు భాగంలో వెన్నముకకు ఇరువైపులా చిక్కుడు గింజ ఆకారంలో కిడ్నీలు ఉంటాయి. పిల్లల్లో సాధారణంగా నాలుగు సెంటీమీటర్లు, పెద్దలలో 9-12 సెంటిమీటర్ల వరకు ఉంటాయి. ఒక్కో కిడ్నీ బరువు 150 గ్రాముల వరకు ఉంటుంది.
ఉచితంగా డయాలసిస్ సేవలు
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నాం. మెదక్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా కిడ్నీ రోగులు వస్తున్నారు. వారికి ఇక్కడ చికిత్సలు అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. గతంలో డయాలసిస్ కేంద్రంలో 5 పడకలు మాత్రమే ఉండేవి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో మరో 5 పడకలు ఏర్పాటు చేశాం. ప్రతి రోజు 40 మందికి సేవలు అందించే అవకాశం ఉంది.
-డాక్టర్ పి.చంద్రశేఖర్, మెదక్ జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్