సంగారెడ్డి, ఏప్రిల్30: కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వాలు కార్మిక రక్షణ చట్టాలు అమలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈశ్రమ్ పోర్టల్ తీసుకొచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు 1,25,216 మంది ఈశ్రమ్లో పేర్లు నమో దు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురైతే ఆదుకునేందుకు సంక్షేమ మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పని చేసే ప్రదేశాల్లో ఏదై నా ప్రమాదం జరిగి మృతి చెందినా, అంగ వైకల్యం కలిగినా సంక్షేమ మండలి కార్మిక కుటుంబాలకు అసరాగా నిలుస్తున్నది. మే డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కార్మిక సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి.
ఈశ్రమ్లో చేరడానికి అర్హులు..
ఈశ్రమ్ పథకంలో చేరడానికి 18 నుంచి 59 ఏండ్ల లోపు వారు అర్హులు. ఆదాయపు పన్ను చెల్లించని కార్మికులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయంలేని వారు, అసంఘటితరంగ కార్మిక కేటగిరీల్లో తప్పనిసరిగా పనిచేస్తున్న వారు అర్హులు. ఈశ్రమ్లో పేరు నమోదు చేసుకుంటే ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనలో రూ.2 లక్షల ప్రమాద, మరణ, అంగవైకల్య బీమా ఉచితంగా కల్పించారు. అసంఘటిత రంగ కార్మికులకు అనేక లాభాలున్నాయి. ఈశ్రమ్ సేవలు పొందేందుకు గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ)ల్లో పేర్లు నమోదు చేసుకుంటే యూఏఎన్ కార్డు జారీచేస్తారు.
సంక్షేమ మండలితో పథకాలు..
ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో తన వాటా ఏడాదికి రూ.2 చొప్పున, ప్రతి యజమాని కార్మికుడి తరఫున రూ.5లు ఈ నిధికి చెల్లిస్తారు. సంక్షేమ నిధి రుసుం www.labour.telangana,gov.in ఆన్లైన్లో జమ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. వైద్య సహాయానికి రూ.20 వేలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ప్రమాదాల్లో గాయాలతో చికిత్స పొందుతున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు లాభం చేకూరుతుంది. కార్మికుడు మృతి చెందితే రూ.30 వేలు, సహజంగా మరణిస్తే రూ.10 వేలు సాయం అందజేస్తారు. అంగవైకల్యం ఏర్పడితే రూ.20వేలు, ఈఎస్ఐ, నష్టపరిహార చట్టం కింద కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది. అంత్యక్రియలకు రూ.5వేలు, వివాహ కానుకల కింద ఒకరికి రూ.10వేలు, ప్రసూతి సాయం రూ.5 వేలు, కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకుంటే రూ.2 వేలు నగదు అందజేస్తున్నారు.