వెల్దుర్తి/ మునిపల్లి, ఏప్రిల్: రేడియోలు ఆగిపోయాయి. టేప్ రికార్డర్లు మూగబోయాయి. కెమెరాల కన్ను లొట్టబోయింది. చేతి మణికట్టుకు అందాన్నిచ్చే గడియారాలు మూలనబడ్డాయి. ఉత్తరాలు చెత్తబుట్టలో పడ్డాయి. రేడియో, టేప్రికార్డర్లు, కెమెరాలు, గడియారాలు, ఉత్తరాలు.. వీటన్నంటిని తనలో ఇముడ్చుకుని ప్రతి మనిషి జీవితంలో ఒక భాగమైంది సెల్‌ఫోన్. సాంకేతిక విప్లవం పరుగులిడుతున్న నేటి రోజుల్లో సెల్ ఫోన్ రాజ్యమేలుతున్నది. పల్లె, పట్టణం అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రపంచ సమాచారాన్ని క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షం చేస్తున్నది. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఆన్లైన్ గేమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు.
మొబైల్ ఉంటే చాలు గంటలు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందిన క్రమంలో బడిపిల్లలు కూడా మైదానాన్ని మరిచిపోతున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, చిన్న స్క్రీన్‌ను గంటల తరబడి చూడడంతో కంటి చూపుదెబ్బ తినే అవకాశం ఉందంటుని విశ్లేషకులు చెబుతున్నా పట్టించుకునేనాథులు కరువయ్యారు. మనిషి మనుగడను శాసించినంత వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వాగతించవచ్చు. కానీ వీటి దుష్పరిణామాలు పరిధులు దాటి కొత్త పుంతలు తొక్కితే పాత కాలం ఆటలు ఒక జ్ఞాపకంలా మిగిలిపోతాయి.
అన్నీ తానైన మొబైల్
సెల్‌ఫోన్ కేవలం మాట్లాడడానికే కాకుండా సమాచారం చేరవేయడం, తెలుసుకోవడం, ఫొటోలు, వీడియోలు పంపడం, బ్యాంకులకు వెళ్లకుండానే నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం, క్షణాల్లో అవసరమైన, కావాల్సిన ప్రపంచ సమాచారాన్ని తెలుసుకోవడంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. నేడు ప్రతిఒక్కరూ తమ జీవితాలను సెల్‌ఫోన్‌తో బంధించుకున్నారు.
మరిచిపోయిన క్యాలిక్యులేటర్లు..
లెక్క చిన్నదైనా, పెద్దదైనా క్యాలిక్లేటర్లను ఉపయోగించేవారు. పెన్ను, పేపర్ ఉపయోగించి, రాసుకునేవారు. నేడు సెల్ఫోన్లలోనే అన్ని సదుపాయాలు ఉండడంతో క్యాలిక్లేటర్ను మోసే బాధ తప్పింది. సెల్ఫోన్లోనే లెక్కలు చేస్తూ, సేవ్ చేసుకుంటున్నారు.
క్రేజ్ తగ్గిన కెమెరా
గతంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఏదైనా విహారయాత్రకు వెళ్లినా ఆ తీపిగుర్తులను భద్రంగా దాచుకోవడానికి కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసుకునేవారు. మొదట్లో రీల్, అనంతరం డిజిటల్ కెమెరాలు వచ్చాయి. దీంతో ఆధునికంగా, వివిధ రకాలుగా ఫొటోలు, విడియోలు తీసేవారు. నేడు సెల్ఫోన్లు కెమరాలను మించిన ఫొటోలు తీస్తున్నాయి. తీరొక్క రంగులు, డిజైన్లు, గ్రాఫిక్స్‌తో మిక్స్ చేయడమే కాకుండా క్షణాల్లో ఇతరులకు పంపించే అవకాశం ఉండడం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే సౌకర్యంతో జనంలోకి మరింత జొచ్చుకుపోయింది.
మైదానం మరిచి..
యువత, విద్యార్థులు పొద్దస్తమానం మైదానంలో ఆటలాడుతూ కనిపించేవారు. ఇప్పుడు ఓ గదిలో కూర్చుని అర చేతిలో ఆటలు ఆడుతున్నారు. ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు, దేహదారుఢ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు పలు రకాల ఆటలు ఆడేవారు. ఇప్పుడు కాలక్షేపం, తాత్కాలిక ఆనందం కోసం సెల్ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు. తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు.
ఆగిన రేడియోలు..
మూగబోయిన టేప్రికార్డర్లు ఒకప్పుడు రేడియో, టేప్ రికార్డర్లు లేని ఇండ్లు ఉండేవి కావు. వీటి ద్వారా ప్రజలు మధురమైన పాటలు వినేవారు. రేడియోలో వచ్చే వార్తలు, నాటికలు, పంటల సాగు వివరాలు వచ్చే సమయానికి అందరు ఒకచోట చేరేవారు. నేటి ఆధునిక ప్రపంచంలో రేడియోలు ఆగిపోయాయి. టేప్రికార్డర్లు మూగబోయాయి. అటు విడుదలైన పాటలు క్షణాల్లో ఆన్లైన్లో వస్తుండడంతో రెడియో, టేప్రికార్డలను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు.
కనుమరుగైన ఉత్తరాలు
ఉత్తరాలు.. దూరంగా ఉన్న బంధుమిత్రుల సమాచారం, పిల్లల యోగక్షేమా లు, తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులను ఉత్తరాల ద్వారా తెలుసుకునేవారు. కాలక్రమేణా లేటర్లు, ల్యాండ్ ఫోన్లు వచ్చినా అందరికీ అందుబాటులో ఉండేవి కావు. నేడు సెల్ ఫోన్ రాకతో అంతర్జాలంలో అంతా కలిసి సోషల్ మీడియా యాప్‌లతో క్షణాల్లో సమాచారాన్ని చేరవేస్తున్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్‌లు చరిత్రను రాస్తున్నాయి.
ఆండ్రాయిడ్ ఆటలు
ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్ సాయంతో వీలైనన్ని గేమ్స్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. పిల్లల చదువు కూడా ఇప్పుడు యాప్‌లతో ముడిపడి ఉంటున్నది. దీంతోపాటు వారికి ఇష్టమైన యాంగ్రీ బడ్స్, క్యాండీ క్రష్ లాంటి అనేక గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్ దొరికిందంటే చాలు చిన్నా పెద్ద తేడాలేకుండా ఆడే ఆటలు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ఆటలను బట్టి పాయింట్స్ పెరగడం అందులో చూపించే ర్యాంకులతో ఉత్సాహం పెరుగుతుంది. ఫలితంగా సెల్ఫోన్లకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం వీటి ఆధిపత్యం ఎంత ఉందంటే ఎవరైనా మనల్ని పలకరించినా పట్టించుకోనంత.
మోజుతగ్గిన చేతి గడియారాలు
ఒకప్పుడు చేతికి గడియారం పెట్టుకోవడాన్ని గొప్పగా భావించేవారు. పెళ్లిళ్ల సమయంలో వరుడికి ఆభరణంగా చేతి గడియారాన్ని ఇచ్చేవారు. అంతటి ప్రాచుర్యం పొందిన చేతి గడియారంపై మోజు తగ్గింది. సెల్ఫోన్లో సమయం చూపడం. క్యాలెండర్, పంచాంగం, తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలను సెల్ఫోన్లోనే చూస్తున్నారు. ప్రస్తుతం కొద్దిమంది మాత్రమే చేతి గడియారాలు వాడుతున్నారు.
అరచేతిలో ప్రపంచం
ఆండ్రాయిడ్ ఫోన్లతో ప్రపంచం మన చేతిలో అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల దినపత్రికలతో పాటు అప్డెట్స్ తెలుసుకునే సదుపాయం ఉంటుంది. వ్యాపార లావాదేవీలు ఎక్కువగా సెల్ సాయంతోనే చేస్తుంటారు. హోల్‌సేల్ వస్తువుల ఆర్డర్ సైతం ఇందులోనే ఇస్తుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ వ్యాపార లావాదేవీల్లో ఎంతో ఉపకరిస్తుంది.
– మురళీచంద్ర, ప్రొఫెసర్, మునిపల్లి
చిన్నారులను ఫోన్లకు దూరంగా ఉంచాలి
చిన్నారులను ఆండ్రాయిడ్ ఫోన్లకు దూరంగా ఉంచాలి. చిన్నప్పటి నుంచి ఫోన్లు వినియోగిస్తే కంటి చూపు దెబ్బతింటుంది. చిన్నారులకు ఫోన్ ఆలవాటు పడితే ఇంక అంతే సంగతులు. ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగానికి ఎంత పని చేస్తాయో అంతే ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. తల్లిదండ్రులు చిన్నారు లను సెల్ఫోన్లకు దూరం ఉంచితే మంచిది.
– శిరీష, వైద్యాధికారి, మునిపల్లి
ఆండ్రాయిడ్ ఆటలు ప్రమాదమే..
శారీరక శ్రమతో కూడుకున్న ఆటలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ్రౌండ్లో ఆడే ఆటలతో విద్యార్థుల్లో మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుంది. కానీ సెల్ఫోన్లో ఆడే గేమ్స్‌తో ఒకే చోట గంటల తరబడి కూర్చోవడంతో ఆరోగ్యపరంగా అనర్థాలు తలెత్తుతాయి. గ్రౌండ్లో ఆడే ఒక్కో ఆటతో ఒక్కో ప్రయోజనం ఉంటుంది. సెల్లో ఆటలతో కంటి జబ్బులు వస్తాయి.
– ప్రవీణ్‌కుమార్, టీచర్