చిలిపిచెడ్, ఏప్రిల్ 22:గ్రామస్తుల సహకారం.. ఉపాధ్యాయుల కృషితో మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఈ బడిలో తమ పిల్లలను చదివించేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు, ప్రస్తుతం మెరుగైన ఫలితాలు సాధిస్తుండడంతో స్కూల్లో చేర్పిస్తున్నారు. పాఠశాల గోడలపై వేసిన మహనీయులు, జాతీయ నాయకుల చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తాగునీటి వసతి, వేర్వేరుగా మరుగుదొడ్లు, మధ్యాహ్నం భోజనం వండేందుకు ప్రత్యేక షెడ్లు నిర్మించారు. ‘మన ఊరు – మన బడి’కి పాఠశాల ఎంపిక కావడంతో భవిష్యత్తులో ప్రభుత్వం మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సకల సౌలత్‌లతో ఇక్కడి సర్కార్ బడి ప్రైవేట్‌కు దీటుగా వెలిగిపోతున్నది. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చండూర్ ప్రాథమిక పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, తాగునీరు తదితర సౌకర్యాలతో కార్పొరేట్‌ను తలదన్నుతున్నది. ప్రభుత్వం అమలు చేయనున్న మన ఊరు-మన బడితో ఈ పాఠశాల మరిన్ని హంగులు అద్దుకోనున్నది. చండూర్ ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో జాతీయ నాయకుల చిత్రాలు వేసి సుందరంగా తీర్చిదిద్దారు. బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించారు. మధ్యాహ్న భోజనం వండేందుకు షెడ్లు నిర్మించారు. విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
గ్రామస్తుల ఆదరణ
గతంలో గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ముఖం చాటేసేవారు. పాఠశాలలో మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు. పాఠశాలలో 1నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా చదివిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు కూడా ఆర్థికంగా సహకరిస్తున్నారు. గ్రామానికి చెందిన చౌటకూరి బ్రదర్స్ ఆధ్వర్యంలో గోవర్ధన్‌రెడ్డి 4నుంచి 5వ తరగతిలో ఫస్ట్, సెకండ్ వచ్చిన విద్యార్థులకు రూ.5వేలు, 4వేలు నగదు అందజేస్తున్నారు. పిల్లలు కూర్చునేందుకు కుర్చీలు అందజేశారు. తరగతి గదుల గోడలపై మహనీయుల చిత్రాలు వేయించారు.
పాఠాలు మంచిగా చెప్తున్నరు..
పాఠశాలలో ఉపాధ్యాయుల చదవు బాగా చెబుతున్నారు. పాఠశాలలో టాయిలెట్లు, వాటర్, ప్లేగ్రౌండ్ అన్ని ఉన్నాయ్. డిజిటల్ క్లాస్‌లు, టీవీ క్లాస్‌లు చెప్తున్నరు. ప్రైవేట్ స్కూల్ కంటే మా స్కూలే బాగుంటుంది. ఆటలు కూడా ఆడిపిస్తుంటారు. బాగా చదువుకుంటున్నాం. స్కూల్లో మాకు ఏ లోటు లేకుండా అన్ని మా సార్లు చూసుకుంటున్నరు.
–రెహనా, విద్యార్థి , 5వ తరగతి