మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని మెదక్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యా, వైద్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్తు, ఆర్టీసీ, పోస్టల్ తదితర శాఖల అధికారుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 6 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు జిల్లాలో 13,777 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు.
మొదటి సంవత్సరం జనరల్ 6,619 మంది, ఒకేషనల్ 640, రెండో సంవత్సరం జనరల్ 6,032 మంది, ఒకేషనల్ 486 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ లెక్చరర్‌తో ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, నలుగురు జూనియర్ లెక్చరర్లతో సిట్టింగ్ స్కాడ్ బృందాలను, 5గురు సభ్యులతో కస్టోడియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 13 పోలీస్స్టేషన్లలో ప్రశ్నాపత్రాలను భద్రపరచడంతో పాటు 31 పరీక్షా కేంద్రాలకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు వచ్చేలా బస్సులు నడుపాలని ఆర్టీసీ ఆధికారులను కోరారు. విద్యార్థులు అర్ధ గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. సమావేశంలో మెదక్ డీఎస్పీ సైదులు, జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో మన్నన్ తదితరులు పాల్గొన్నారు.