జహీరాబాద్, ఏప్రిల్3: వందశాతం ఆస్తి పన్ను వ సూలు చేసి, పల్లెల్లో మౌలిక సదుపాయాలు కలిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. మార్చి 31 వరకు గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు ఆ బాధ్యతలు అప్పగించింది. జహీరాబాద్ మండలంలో వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు మండల పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శులు ప్రతి ఇంటికీ తిరిగి ఆస్తి, వృతి పన్నులు వసూలు చేస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో రూ.21,32,843 వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.19,31,905 అంటే 90.58 శాతం పన్నులు వసూలు చేశారు.
90.58 శాతం పన్నులు వసూలు..!
జహీరాబాద్ మండలంలో 22 గ్రామ పంచాయతీలో 90.58 శాతం పన్నులు వసూలు చేశారు. అల్గోల్, అర్జున్ నాయక్తండా, గోవింద్పూర్, హుగ్గెల్లితండా, మదులైతండా, లచ్చినాయక్తండా, మల్చల్మాతండా, శేకాపూర్తండాలో వందశాతం ఆస్తి పన్ను వసూలైంది. అనెగుంటలో 97.04 శాతం, కాశీంపూర్, బుచినెల్లి గ్రామంలో 82 శాతం పన్నులు వసూలు చేశారు. మిగతా గ్రామాల్లో 90శాతానికి పైగా పన్నులు వసూలు చేశారు.
వందశాతం వసూలు చేస్తాం
గ్రామాల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో ఇంటింటికీ పంచాయతీ కార్యదర్శులు తిరిగి ఆస్తి, వృతి, వ్యాపార పన్నులు వసూలు చేస్తున్నారు. గడువులోగా వందశాతం పన్నులు వసూలు చేస్తాం. సర్పంచ్ల సహకారంతో వందశాతం వసూలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలు, వ్యాపారులు పన్నులు చెల్లించి, ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాం. పంచాయతీ కార్యదర్శులు పన్నులు వసూలు చేసేందుకు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతున్నారు.
– మహేశ్వర్రావు, ఎండీవో, జహీరాబాద్