వైభవంగా ముగిసిన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు
13 వారాల పాటు కొనసాగిన ఉత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు
అగ్నిగుండాల వారానికి భారీగా వచ్చిన భక్తులు
చేర్యాల, మార్చి 27: ప్రముఖ పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆల యం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామివారి బ్రహ్మోత్సవాల చివరి ఆదివారం, అగ్నిగుండాల కార్యక్రమాల సందర్భంగా 50వేలకు పైగా భక్తులు వచ్చారు. గత డిసెంబర్లో ప్రారంభమైన మల్లన్న బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 11 వారాల పాటు వైభవంగా కొనసాగాయి. శనివారం నుంచే భక్తులు స్వామి వారి క్షేత్రానికి చేరుకున్నారు. డోనర్ల నిర్మించిన గదులు, ప్రైవేటు గదుల్లో బస చేశారు. ఆదివారం వేకువజామునే నిద్రలేచి పవిత్ర స్నానాలు ఆచరించి క్యూలైన్లలో గంటల పాటు వేచిఉండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చిలుక పట్నం, నజరు పట్నం, మహామండప పట్నాలు వేయించి పూజలు నిర్వహించారు. మరికొంత మంది భక్తులు తలనీలాలు సమర్పించి, గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. గుట్టపై భాగంలో ఉన్న ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం ఎదురుగా మల్లికార్జున స్వామి కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ ధర్మకర్తల చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు,ఈవో ఎ.బాలాజీ, ఏఈవోలు వైర్యాగం అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకుడు నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.