– తొమ్మిది భవనాల మంజూరుతో హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది
కోహీర్, మార్చి27: గ్రామీణ ప్రాంత ప్రజల అవసరార్థం మండలంలో 15 ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రభ్తుత్వం ఏర్పాటు చేసింది. దీంతో గర్భిణులు, చిన్నారులకు మేలు జరుగుతున్నది. మండలంలోని 24 పంచాయతీలకు 15 సబ్ సెంటర్లలో వైద్యసేవలు అందిస్తున్నారు. పీచెర్యాగడి, గొటిగార్పల్లి, బిలాల్పూర్, గురుజువాడ గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల నిర్వహణకు సొంత భవనాలు నిర్మించింది. మిగతా గ్రామాల్లో అద్దె చెల్లిస్తున్నారు. మాచిరెడ్డిపల్లి, కవేలి, దిగ్వాల్ గ్రామంలో పంచాయతీ స్థలంలో ఉన్న భవనాల్లోనే వైద్య సేవలు కొనసాగుతున్నాయి. మిగతా 8 గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలు మాత్రం భవనాలకు బాడుగ చెల్లించి అందులో చికిత్సలను నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు గర్భిణుల వివరాలను నమోదు చేయడం, చిన్నారులకు టీకాలు వేయడం నిరంతరంగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాలకు నియమించిన ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు సేవలందిస్తున్నారు. కొవిడ్ టీకా, ఇంటింటా ఆరోగ్య సర్వే చేపడుతున్నారు.
తొమ్మిది సబ్ సెంటర్లకు భవనాలు
మండలంలోని 24 పంచాయతీల్లో 7 గ్రామాల సబ్ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వ భవనాలున్నాయి. ప్రభుత్వం మరో తొమ్మిది సబ్ సెంటర్లకు సొంత భవనాలు మంజూరు చేసింది. కోహీర్ పట్టణానికి ఏ,బీ,సీ సెంటర్లు, దిగ్వాల్, మాచిరెడ్డిపల్లి, మనియార్పల్లి, ఖానాపూర్, నాగిరెడ్డిపల్లి, పైడిగుమ్మల్ గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా గ్రామాల్లో 150 నుంచి 200 గజాల ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించింది. త్వరలో భవన నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.