ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి
ఒకే కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు
మనూరు, మర్చి 25: సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మనూరు మండలంలోని కమలాపూర్ చెరువులో శుక్రవారం జరిగింది. నారాయణఖేడ్ సీఐ రామకృష్ణ, మనూరు ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకా రం.. నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగళ్పేట్కు చెందిన శ్రీనివాస్ కుమారుడు నాయకుని మహేశ్(12), కోట పండరీ రేణుకలకు ఇద్దరు కుమారులు కోట సాయి చరణ్(11), కోట సాయి సంపత్(12), కల్హేర్ మండలం ఖానాపూర్‌కు చెందిన ర్యాకల రాములు కుమారుడు వినోద్(10) స్నేహితులు. వీరిలో మహేశ్, వినోద్ మంగళ్‌పేట్ ప్రాథమిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నా రు. సాయిచరణ్, సాయి సంపత్ నారాయణఖేడ్ జీడ్పీహెచ్ఎస్లో చదువుతున్నారు. గురువారం నలుగురు కలిసి నారాయణఖేడ్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో తాళాలు వేయని మూడు సైకిళ్లను తీసుకునివెళ్లారు. అనంతరం నలుగురు కలిసి మనూరు మండలంలోని కమలాపూర్ గ్రామ సమీపంలో ఉన్న చెరువులో స్నానం చేసేందుకు దిగారు. ఈత రాక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గురువారం సాయత్రం చెరువు కట్ట పక్కన సైకిళ్లు, బట్టలను గమనించిన స్థానికులు చెరువులో చూడగా మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మ హేశ్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమి త్తం నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మిగిలిన వారి కోసం ప్రయత్నించినా చీకటి పడడంతో శుక్రవారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురి మృత దేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పంచాయతీ కార్యదర్శి జగన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శోకసంద్రంలో కుటుంబాలు
ఇంటికి తిరిగి వస్తారనే ఆశతో ఉన్న తల్లిదండ్రులకు సాయంత్రం చెరువులో పడి మృతి చెందారని తెలియడంతో మూడు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. మంగళ్పేట్కు చెందిన కోట పండరి, రేణుకల ఇద్దరు కుమారులు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చిన్నారుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
నారాయణఖేడ్, మార్చి 25: మనూరు మండలం కమలాపురం చెరువులో మునిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్‌పేట్‌లోని వారి ఇండ్లకు వెళ్లి ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అనుకోని రీతిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.