మెదక్, మార్చి 20 : సీఎం కేసీఆర్, కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించినప్పటి నుంచి మెదక్ జిల్లాలోని సర్కారు దవాఖానలు కాన్పులతో కళకళలాడుతున్నాయి. గర్భిణుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ దవాఖానల్లో పిల్లలకు జన్మనిచ్చిన బాలింత లు ఈ పథకం నుంచి ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ పథకం ప్రధాన ఉద్ధేశం ప్రసవం తర్వాత మహిళలకు, నవజాత శిశువులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు కల్పించడం, వారు ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవడం.. ఈ కిట్‌లో మహిళలకు, వారి పిల్లలకు కావాల్సిన 16 రకాల ఐటమ్‌లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. పుట్టిన పిల్లలు హైజీన్‌గా, సురక్షితంగా ఉండేలా కాపాడుతోంది. ఈ కిట్‌లో పుట్టిన పిల్లలకు అవసరమయ్యే డైపర్లు, నాప్కిన్స్, టోయ్స్, దోమ తెరలు, బేబీ పౌడర్, బేబీ ఆయిల్, బేబీ సోపు లు, పిల్లలకు కావాల్సిన బట్టలున్నాయి. కేసీఆర్ కిట్ స్కీమ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 జూన్ 2న ప్రారంభించారు. ఈ స్కీం ప్రారంభించినప్పటి నుంచి 2022 సంవత్సరం మార్చి వరకు మెదక్ జిల్లాలో 13,942 మంది కేసీఆర్ కిట్ కోసం దరఖాస్తు చేసుకోగా, 13,470 మంది బాలింతలకు కేసీఆర్ కిట్‌ను అందజేశారు.
కేసీఆర్ కిట్ వీరికే ఇస్తారు..
కేసీఆర్ కిట్ స్కీంలో గర్భిణులు అర్హులు. అయితే వీరు ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీ చేయించుకోవాలి. గరిష్టంగా రెండు డెలివరీలకు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలుంటే ఈ స్కీం కింద ప్రయోజనాలు పొందేందుకు అనర్హులు. ఇతర రాష్ర్టాల తల్లులకు ఈ స్కీం వర్తించదు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఆధార్‌కార్డు తల్లి వద్ద ఉండాలి. ప్రైవేట్ దవాఖానల్లో జన్మనిచ్చిన పిల్లలకు కూడా ఈ స్కీం వర్తించదు. లబ్ధిదారులు దగ్గరలోని పీహెచ్సీ సెంటర్లో లేదా ప్రభుత్వ దవాఖానల్లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఆశ కార్యకర్తలకు గర్భిణి వివరాలు ఇచ్చి కూడా రిజిస్ట్రర్ చేసుకోవచ్చు. డీఈవో, ఏఎన్ఎం ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. లబ్ధిదారుల నుంచి వారి పేరు, వయస్సు, అడ్రస్, ఫోన్ నంబర్, రిజిస్ట్రేషన్ డేట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి తీసుకొని డీఈవో, ఏఎన్ఎం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
నగదు ప్రోత్సాహకం..
కేసీఆర్ కిట్ పథకం విజయవంతం వెనుక నగదు ప్రోత్సాహక పథకం పాత్ర ప్రముఖంగా ఉంది. గర్భిణి దశ నుంచి శిశువుకు తొమ్మిదో నెల వచ్చే వరకు నాలుగు విడతలుగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లోకే వేస్తుండడంతో అనూహ్య స్పందన లభిస్తోంది. ఆడ పిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేల చొప్పున ప్రభు త్వం అందిస్తోంది. డెలవరీ అయిన తర్వాత కూడా అమ్మ ఒడి పథకం కింద తల్లి పుట్టిన పిల్లను ఇంటి వద్దనే డ్రాప్ చేస్తున్నది. కేసీఆర్ కిట్ దేశానికి ఆదర్శంగా నిలిచింది.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో..
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించిన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. గతంలో సర్కారు దవాఖానలో సౌకర్యాలు లేకపోవడంతో రోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత సర్కారు దవాఖానల్లో ప్రసవాలు అయిన బాలింతలకు కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఐదేళ్ల కాలంలో 13,470 కేసీఆర్ కిట్లను అందజేశారు. ఐసీయూతో పాటు డయాలసిస్ కేంద్రం, అన్ని రకాల రక్త పరీక్షలు చేసేలా డయాగ్నస్టిక్ హబ్‌ను కూడా ఏర్పాటు చేయించారు. కోట్లాది రూపాయల నిధులను సర్కారు దవాఖానలకు రాష్ట్ర ప్రభు త్వం ద్వారా వెచ్చించారు. అంతేకాకుండా రూ. 20కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు, కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. త్వరలో ఎంసీహెచ్ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
ఐదేండ్ల్లలో 13,470 కిట్లు అందజేత..
మెదక్ జిల్లాలో 2017న ప్రారంభమైన కేసీఆర్ కిట్ పథకంలో 2022 మార్చి 6వ తేదీ వరకు 13,470 కేసీఆర్ కిట్లను అందజేశారు. గతంలో సర్కారు దవాఖానకు వెళ్లాలంటేనే భయపడే మహిళలు ఇప్పుడు సర్కారు దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి. ప్రతి రోజూ ఓపీతో జిల్లాలోని సర్కా రు దవాఖానాలతో పాటు పీహెచ్‌సీల్లో ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్యాన్ని పొందుతున్నారు. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించడంతో పాటు అన్ని రకాల పరీక్షల కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో డయాగ్నస్టిక్ హబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నూతనంగా మాతా శిశు సంరక్షణ కేంద్రం భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలో 13,470 మందికి కేసీఆర్ కిట్లు..
మెదక్ జిల్లాలో 2017నుంచి 2022మార్చి 6వరకు 13,470 మందికి కేసీఆర్ కిట్లను అందజేశాం. జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానతో పాటు నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేటలో ఉన్న దవాఖానల్లో ప్రసవాలు జరిగిన మహిళలకు కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నాం. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కేసీఆర్ కిట్‌ను ఇస్తున్నాం. ఈ కిట్‌లో మహిళలకు, వారి పిల్లలకు కావాల్సిన 16 రకాల ఐటమ్లు ఉన్నాయి.
– డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్‌వో
డెలివరీ అయిన వెంటనే కేసీఆర్ కిట్ అందిస్తున్నాం..
జిల్లా కేంద్ర దవాఖానలో ప్రసవాలు అయిన వెంటనే కేసీఆర్ కిట్‌ను అందజేస్తున్నాం. ప్రసవం తర్వాత వారం రోజుల పాటు దవాఖానల్లోనే తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూస్తున్నాం. ప్రతి నెలా 300 నుంచి 350 వరకు ప్రసవాలు చేస్తున్నాం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ పి. చంద్రశేఖర్, జిల్లా కేంద్ర దవాఖాన సూపరింటెండెంట్