నర్సాపూర్‌లో మూడు ఎకరాల్లో 460 మొక్కల పెంపకం
సీఎం కేసీఆర్ సూచనల మేరకు సాగుకు శ్రీకారం
రైతు సూరారం నర్సింహులు ముందడుగు
లాభాలు వస్తాయని ధీమా..
ఆసక్తి ఉన్నవారికి సలహాలు ఇస్తానని వెల్లడి
నర్సాపూర్, మార్చి 15 : తెలంగాణ రాష్ట్రంలో కొబ్బరి పంటల సాగు అంతంత మాత్రమే. కొబ్బరికాయలు, కొబ్బరి బోండాలు కావాలంటే ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోవలసిందే. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాపారులు ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. ప్రతి సీజన్లో కొబ్బరికాయలకు మంచి డిమాండ్ ఉండడంతో పాటు కొబ్బరి సాగుతో లాభాలు కూడా అధికంగా వస్తాయి. దీంతో మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన రైతు సూరారం నర్సింహులు కొబ్బరి సాగుకు శ్రీకారం చుట్టాడు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సూరారం నర్సింహులు తనకున్న 3 ఎకరాల పొలంలో కొబ్బరి పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం తన ఇంటి వద్ద 3, పొలం వద్ద 2 దేశవాళి కొబ్బరి మొక్కలను నాటాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత కొబ్బరి చెట్లు మంచి కాతకాయడంతో ప్రతి సంవత్సరం ఒక్కొక్క చెట్టుకు 50 నుంచి 60 కాయలు కాశాయి. ఇది గమనించిన నర్సింహులు కొబ్బరి సాగులో యాజమాన్య పద్ధతులను పాటిస్తే ఇంకా ఎక్కువ దిగుబడి సాధించవచ్చని గ్రహించి కొబ్బరి పంట పూర్తిస్థాయిలో సాగుకు ఆసక్తి చూపాడు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారి రామకృష్ణ సలహాలు తీసుకుని సూరారం నర్సింహులు కొబ్బరి పంటను సాగు చేయడం ప్రారంభించాడు. రాజమండ్రి కడియెపులంక నుంచి సన్నంగి రకం ఒక్కో మొక్కను రూ.230 చొప్పున 460 కొబ్బరి మొక్కలను తీసుకువచ్చి పొలంలో నాటాడు. మొక్కను పాతడానికి 2.5 ఫీట్ల లోతు, వెడల్పుతో గుంతను తీశాడు. గుంతలో సింగల్ సూపర్ ఫాస్పేట్ మందును 200 గ్రా. చొప్పున ప్రతి గుంతలో వేయడంతో పాటు ప్రతి మొక్కకు 25 గ్రాముల చొప్పున గుళికలను వేశాడు. అలాగే, 1 కిలో వర్మీ కంపోస్ట్ ఎరువును ప్రతిగుంతలో వేశాడు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద డ్రిప్ పరికరాలను కొనుగోలు చేసి ప్రతి మొక్కకు నీరు అందేలా చర్యలు తీసుకున్నాడు.
కొబ్బరి పంట లాభసాటి వ్యవసాయం
కొబ్బరి పంట మంచి లాభసాటి వ్యవసాయం. సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించడంతో కొబ్బరి సాగు చేయాలని నిర్ణయించుకున్నాను. మొదట్లో మామిడి, జామ వేద్దామని అనుకున్నా. కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో కొబ్బరి పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నాను. కొబ్బరిసాగుకు కోతులతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం మన ప్రాంతంలో అక్కడక్కడా కొబ్బరి చెట్లు మంచి కాత కాస్తున్నాయి. ప్రతి చెట్టుకు సంవత్సరానికి 100 కాయలు కాసినా ఒక్కో కాయకు రూ.10 వేసుకున్నా సంవత్సరానికి ఒక్కచెట్టుపై రూ. 1000 లాభం వస్తుంది. 3 నుంచి 4 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చు. మన రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను బట్టి కొబ్బరి మొక్క నాటినప్పటి నుంచి 6 సంవత్సరాలకు కోతకు వస్తుంది. ఎవరైనా కొబ్బరి సాగు చేయాలనుకుంటే వారికి పూర్తి అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నాను.
–సూరారం నర్సింహులు,రైతు