మెదక్ రూరల్, మార్చి 9: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని క్రిష్టల్ గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారి జయరాం నాయక్ అధ్యక్షతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరై జ్వోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. అంతకుముందు ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళా ఉద్యోగులను సన్మానించి, ఆటలపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్ కుమార్, సెక్టోరల్ అధికారి సుభాష్ నాయక్, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకట్రెడ్డి, సీడీపీవోలు హేమభార్గవి, భార్గవి, అంగన్వాడీ టీచర్లు, తదితరులున్నారు.