చేర్యాల, జూలై 16 : కొమురవెల్లి మల్లన్న ఆలయంలో విధులు నిర్వహించే కొందరు సిబ్బంది నిర్లక్ష్యంతో స్వామి వారి ఖజానాకు చిల్లుపడే పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకున్న బంగారం బ్యాంకులో జమ చేసి తీసుకున్న గోల్డ్‌బాండ్ మాయం కావడంతో ఆలయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2016 సంవత్సరంలో 2కిలోల బంగారం హైదరాబాద్‌లోని ఓ బ్యాంకులో జమచేసి స్వామివారి పేరిట గోల్డ్బాండ్ను ఆలయ అధికారులు తీసుకున్నారు. ఐదేండ్ల కాల పరిమితి ముగియడంతో గోల్డ్‌బాండ్ తీసుకునేందుకు ఆలయ అధికారులు 2021లో హైదరాబాద్‌లోని ఎస్బీఐ శాఖకు వెళ్లారు. ఈ సమయంలో గోల్డ్‌బాండ్ ఒర్జినల్ సమర్పించాలని బ్యాంకు అధికారులు సదరు ఇన్చార్జిని అడిగారు. దీంతో ఆలయ ఇన్చార్జి వద్ద ఉన్న గోల్డ్బాండ్కు సంబంధించిన పత్రాలను అందజేశారు. వాటిని గమనించిన బ్యాంకు సిబ్బంది గోల్డ్‌బాండ్ సక్రమంగా లేదని ఒర్జినల్ తీసుకురావాలని సూచించారు. నాటి నుంచి నేటి వరకు స్వామి వారికి సంబంధించిన గోల్డ్బాండ్ను తీసుకువచ్చే పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. గోల్డ్‌బాండ్ కనిపించకుండా పోయిన విషయాన్ని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దృష్టికి, బయటకు పొక్కనివ్వడం లేదు.
ఆలస్యం కానున్న సంకల్పం
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో బంగారు కిరీటం చేయించేందుకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బం గారానికి సంబంధించిన గోల్డ్‌బాండ్ లేకపోవడంతో బ్యాం కర్లు బంగారం తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిసింది. స్వామివారి కల్యాణోత్సవం వరకు బంగారు కిరీటం తయారు చేయించి సమర్పించుకోవాలనే మంత్రి, ఎమ్మెల్యేల సంకల్పం నెరవేరని పరిస్థితి నెలకొంది. సంబంధిత ఇన్చార్జి పదేండ్లుగా తిష్టవేసుకొని ఆలయంలో ఇష్టారాజ్యంగా పనులు చేస్తుండడంతో గోల్డ్‌బాండ్ కనిపించకుండా పోయిందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆలయ ఈవో బాలాజీని ఫోన్లో వివరణ కోరగా, గోల్డ్‌బాండ్ లేకపోవడంతో దానికి బదులుగా డూప్లికేట్ సమర్పించినట్లు తెలిపారు. సంవత్సర కాలం పాటు దానికి సంబంధించిన రెన్యువల్ సైతం అవుతుందని, మూడు, నాలుగు రోజుల్లో ముంబై నుంచి ఒర్జినల్ బాండ్ వస్తుందన్నారు.
ఆలయంలో సీల్డు టెండర్లు
చేర్యాల, జూలై 16 : ఈ నెల 21న కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వామివారికి, అమ్మవార్లకు పూలదండల సరఫరా, ఆలయ అన్నప్రసాద వితరణశాలకు కూరగాయలు, పాలు, పెరుగు సరఫరాతో పాటు ఆలయంలో జరిగే కార్యక్రమాలకు ఫొటోలు, వీడియోలు తీసేందుకు సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వ్యాపారులు, సంస్థలు ఈ నెల 19వ తేదీలోగా షెడ్యూలు కొనుగోలు చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయనతో ఏఈవో వైరాగ్యం అం జయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.