మెదక్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ప్రతి నెలా 2, 16వ తేదీల్లో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఈ కార్యక్రమంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 40 వినతులు వచ్చా యి. వాటిలో భూములు, పింఛన్, ఇండ్లు, విద్యుత్, రెవెన్యూ సమస్యలతో పాటు వివిధ సమస్యలు ఎమ్మె ల్యే దృష్టికి వచ్చాయి. వాటిని వెంటనే పరిష్కరించేలా ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు.
44 మందికి కల్యాణ లక్ష్మి చెక్కుల అందజేత
పాపన్నపేట మండలానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను (రూ.44 లక్షల 5వేలు) ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రామాలు, పట్టణాలు సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ సాయంతో ఎన్నో పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
దళారులను నమ్మొద్దు
డబుల్ బెడ్ రూం ఇండ్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే తెలిపారు.. డబుల్ బెడ్ రూం ఇండ్లు, పెన్షన్లు, విద్యుత్, రెవెన్యూ సమస్యల గురించి వినతులు వచ్చాయన్నారు. ఇండ్ల మంజూరులో స్థలం, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి పారదర్శకంగా సర్వే చేయించి ఆగస్టు 7న 700 మం ది నిరు పేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇం డ్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా మిగిలి ఉంటే వారికి కూడా భవిష్యత్‌లో మంజూ రు చేయిస్తామన్నారు. ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరూ కూడా దళారుల మాటలు నమ్మకూడదన్నారు. అలా ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. త్వరలో సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, వసంత్‌రాజ్, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, సుంకయ్య, పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, తహసీల్దార్ ఫర్దీప్సింగ్, సర్పంచులు గురుమూర్తిగౌడ్, లింగారెడ్డి, మల్లేశం, శ్రీకాంత్, సుధాకర్, అనురాధ, ఏడుకొండలు, లక్ష్మీదుర్గయ్య, సంజీవ్‌రెడ్డి, ఎంపీటీసీలు నాగలక్ష్మి, వెంకట్‌గౌడ్, సరస్వతి, వెంకటేశ్, రాములు, సాయిరెడ్డి, గోపాల్‌రెడ్డి పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.