మనోహరాబాద్, నవంబర్ 17: ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్ మన దైనందిన జీవనంలో ఓ భాగమైంది. ఆధునిక టెక్నాలజీతో వస్తున్న స్మార్ట్ఫోన్లలో ఇంటర్నెట్ను సరిగ్గా ఉపయోగించుకుంటే విలువైన సమయాన్ని ఆదాచేసుకోవడంతో పాటు పనులు త్వరగా పూర్తి చేసుకోవచ్చు. సేవలు సులభంగా పొందవచ్చు. అవగాహన లోపంతో ప్రతి చిన్న పనికి జనం మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్లి తమ సమయాన్ని, డబ్బులు వృథా చేసుకుంటున్నారు. మీ సేవ, ఇంటర్నెట్ కేంద్రాల్లో సర్వీస్ చార్జీలతో పాటు పేపర్, ఇంటర్నెట్ సర్వీస్ చార్జీలు వసూలు చేస్తుండడంతో సేవలకు అధిక వ్యయం చేయాల్సి వస్తున్నది.
అరచేతిలో సమాచార విప్లవంతో ప్రపంచం చేతికి వచ్చింది. అనేక సేవలు సులభతరం అయ్యాయి. ఈ కోవలో ప్రజలకు పౌర సేవలను సులభంగా అందించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఆధునిక సమాచార ప్రపంచంలో ప్రతిపల్లె..ప్రతి ఇల్లు..ప్రతి వ్యక్తి చేతిలోకి ఇంటర్నెట్ వచ్చి చేరింది. కంప్యూటర్లు, ల్యాప్‌లాప్‌లు, సెల్ఫోన్లలో ఇంటర్నెట్తో ఇంటి నుంచే అనేక సేవలు పొందేందుకు అవకాశం ఏర్పడింది. వీటిపై ఎక్కువ శాతం మంది ప్రజలకు అవగాహన లేక వినియోగించుకోలేక పోతున్నారు. ప్రతి చిన్న పనికి మీసేవలు, సర్వీస్ సెంటర్లు, దళారులను ఆశ్రయించి వాళ్లు అడిగినంత డబ్బులు చెల్లిస్తున్నారు. కొంచెం అవగాహన పెంచుకుంటే ఇంటి వద్ద నుంచే అనేక సేవలను సులభంగా పొందవచ్చు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం…
ప్రసుత్తం ఆధార్‌కార్డుతో పాటు పాన్‌కార్డు తప్పనిసరిగా మారింది. కాగా, పాన్‌కార్డును పర్సన్ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆధార్ కార్డు నెంబర్, వివరాలను అందిస్తే పది రోజుల్లో పాన్‌కార్డు ఇంటికి వస్తుంది. అత్యవసరంగా కావాలంటే ఆధార్‌కార్డుకు కేవైసీ ఉంటే గంటలోనే మీ ఈ మెయిల్ ఐడీకి పాన్‌కార్డు జిరాక్స్ వస్తుంది. దీనికోసం రూ. 107 యూపీఐ, బ్యాంక్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు రూ. 150 నుంచి 250పైగా అధికంగా వసూలు చేస్తున్నారు.
మీసేవ కేంద్రాల్లో చేసుకునే ప్రతి దరఖాస్తును ఇంట్లో కూర్చొని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఇందుకు ‘టీఎస్ మీసేవ’ అని గూగుల్‌లో సెర్చ్ చేసి ముందుగా సిటిజన్ లాగిన్ పొందితే సరిపోతుంది. సిటిజన్ లాగిన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం ఫోన్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ ఉంటే సరిపోతుంది. కుల, ఆదాయ, నివాస సర్టిఫికెట్ల నుంచి ప్రతీది ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అనంతరం పొందిన రసీదు నెంబర్‌తో మీ సేవ కేంద్రాలకు వెళ్తే రూ. 5 నుంచి రూ. 15 వరకు పేపర్ చార్జీలను తీసుకొని సర్టిఫికెట్‌ను ప్రింట్ తీసి ఇస్తారు. దీంతో డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
సామాన్యులకు సైతం సులభంగా రెవెన్యూ సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ను తెచ్చింది. ‘ధరణి’ పోర్టల్ ద్వారా ప్రభుత్వం పారదర్శకంగా రెవెన్యూ సేవలను అందిస్తున్నది. ఇందుకోసం ధరణి సేవలను మరింత మెరుగు పర్చింది. ధరణి పోర్టల్ ద్వారా ఉచితంగా భూ వివరాలను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా సిటిజన్ లాగిన్ ద్వారా హాయిగా ఇంట్లోనే కూర్చొని ధరణి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ముందుకు ధరణి పోర్టల్‌లో సిటిజల్ లాగిన్ చేసుకొని భూక్రయవిక్రయాల వివరాలను పొందుపరిచి, సర్వీస్ ట్యాక్స్‌ను యూపీఐ లేదా బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించవచ్చు. ఇలా
సేవలను సులభంగా పొందవచ్చు.
మన ఇంటి నుంచే ఆన్లైన్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కల్యాణలక్ష్మి పోర్టల్ ద్వారా పూర్తి ఉచితంగా ఎలాంటి రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు చేయడానికి ఉపయోగించిన ఒరిజినల్ కాగితాలు, ఒక సెట్టు జిరాక్సు కాపీలను తహసీల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. కాగా, చాలామందికి వీటిపై అవగాహన లేక సేవలకు ఇంటర్నెట్ కేంద్రాల్లో అధిక డబ్బులు చెల్లిస్తున్నారు. దీనికి తోడు దళారులు సైతం రూ. 2000 నుంచి రూ. 5000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులు దళారులను నమ్మి మోస పోవద్దని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.
మీ ఆధార్‌కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం ఉంటే క్షణాల్లో ఆధార్‌కార్డును ఎక్కడైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి యూఐడీఏఐ పోర్టల్‌లో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా ఆధార్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త పీవీసీ ఆధార్‌కార్డు కావాలంటే మాత్రం రూ. 50 రుసుము చెల్లిస్తే నెల రోజుల్లో పీవీసీ కార్డుపై ప్రింట్ చేసిన ఆధార్‌కార్డు మీ ఇంటికి వస్తుంది.