సిద్దిపేట, నవంబర్ 15 : ర్యాగింగ్ చట్టరీత్యానేరం.. ర్యాగింగ్ మన సంస్కృతి కాదని సిద్దిపేట అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ అన్నారు. మంగళవారం సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రెషర్స్ డే సందర్భంగా నూతన విద్యార్థులకు ర్యాగింగ్, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేర్వేరు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు నీట్లో ర్యాంకు సాధించి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు పొందడం అభినందనీయమన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలు సాధించేందుకు ఐదేండ్లు కష్టపడి చదవి సమాజంలో మంచి డాక్టర్లుగా పేరు పొందాలన్నారు. విద్యార్థులు అన్నదమ్ములు, అక్కాచెల్లెలుగా కలిసి ఉండాలన్నారు. ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుంచి మూడేండ్ల వరకు జైలు శిక్ష ఉంటుందన్నారు. ర్యాగింగ్ ఒక విష సంస్కృతి అని, దానికి దూరంగా ఉండాలన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. ఏదైనా ఇబ్బం ది ఉంటే డయల్ 100కు కాల్ చేయాలని, తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ కంట్రోల్ రూం 8333998699 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీటు రావడం అదృష్టం
సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీటు రావడం విద్యార్థుల అదృష్టమని కళాశాల ప్రిన్సిపాల్ విమలాథామస్ అన్నారు. రాబోయే కాలంలో సిద్దిపేట కాలేజీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో విద్యనభ్యసించాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీని యాంటీ ర్యాగింగ్ జోనుగా ఉండేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. మెడికల్ కాలేజీ చుట్టూ పక్కల ర్యాగింగ్‌ను నిషేధించామన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాలేజ్ సూపరింటెండెంట్ కిశోర్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.