మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భవన నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.38.5కోట్లతో మూడంతస్తుల్లో అధునాతన వసతులతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాలయం పనులు ఇప్పటికే 60శాతం పూర్తవగా, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయింది. మొదటి, రెండో అంతస్తుల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఆర్ హెడ్ క్వార్టర్స్, బ్యారక్ నిర్మాణాలు సైతం కొనసాగుతున్నాయి. ల్యాండ్ స్కేప్, పార్కింగ్, అంతర్గత రహదారులను త్వరలో చేపట్టనున్నారు. పోలీసు ఉన్నతాధికారుల నివాస గృహాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. భవనాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
మెదక్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజ భవనాన్ని తలపించే హంగులు, గాలి, వెలుతురు, సూర్యరశ్మి వచ్చేలా విశాలమైన గదులు అందరినీ ఆకట్టుకునేలా సిద్ధమవుతున్నది. జిల్లాల ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కార్యాలయ భవనాన్ని మంజూరు చేసింది. జిల్లా కేంద్రంలోని ఔరంగాబాద్ శివారులో సర్వే నంబర్ 78లో కలెక్టరేట్ కార్యాలయ భవనం పక్కన ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. రూ.38.5 కోట్ల వ్యయంతో 50 ఎకరాల్లో మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఎస్పీ కార్యాలయంతో పాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నివాస గృహాలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ముందు ప్రధాన భవన నిర్మాణం అందులోని గదులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ల్యాండ్‌స్కేప్, పార్కింగ్, అంతర్గత రహదారుల నిర్మాణం త్వరలో చేపట్టనున్నారు. కొత్త జిల్లాలన్నింటిలో నిర్మించే జిల్లా పోలీసు కార్యాలయాలను అన్నీ దాదాపు ఇదే తరహాలోనే కడుతున్నారు.
వేగంగా బిల్లులు చెల్లింపు..
జిల్లా పోలీసు కార్యాలయం, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, బ్యారక్ పనులు త్వరతగతిన పూర్తయ్యేలా కాంట్రాక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా త్వరగా వస్తుండడంతో పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే, జూన్ 24న రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మెదక్‌కు వచ్చిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని సందర్శించారు. పనులు త్వరగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పనులు పూర్తి కాగా, మొదటి, రెండో అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. మరో వైపు ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, బ్యారక్ పనులు సైతం జరుగుతున్నాయి. కాగా, ఎస్పీ కార్యాలయానికి గతంలో రూ.12 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.19 కోట్లకు పెంచారు.
ఎస్పీ కార్యాలయంలో విభాగాలు..
గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం16 విభాగాలుంటాయి. ఎస్పీ, ఏఎస్పీ గదులతో పాటు వారి ఓఎస్డీలు, సీసీలు, పీఆర్వోలకు వేర్వేరుగా గదులుంటాయి. స్టోర్స్, ఇన్, అవుట్ వార్డులతో పాటు పాస్‌పోర్టు విచారణ, ఐటీసీ విభాగాలున్నాయి. రిసెప్షన్‌తో పాటు గ్రీవెన్స్ కోసం ప్రత్యేకంగా హాల్ ఉంది. మొదటి ఫ్లోర్లో పరిపాలనా విభాగంలోని ఆయా సెక్షన్ల సూపరింటెండెంట్లు, వారికి ప్రత్యేకంగా రికార్డు గదులు, మినీ కాన్ఫరెన్స్ హాల్, న్యాయసేవా విభాగం ఇలా అన్నీ కలిపి మొత్తం 21 గదులున్నాయి. ఇందులోనే స్పెషల్ బ్రాంచ్‌కు కేటాయించారు. రెండో ఫ్లోర్లో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్, సీసీటీఎన్‌ఎస్‌తో పాటు నేర పరిశోధనలోని ప్రత్యేక విభాగాలుంటాయి. ఐటీ కోర్, సీఆర్డీ అనాలసిస్, సైబర్‌ల్యాబ్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం, డీసీఆర్బీ, రిపోగ్రాఫిక్, పీడీ సెల్, డిజిటల్ శిక్షణ ల్యాబ్‌తో పాటు మహిళా పోలీసు సిబ్బంది, విశ్రాంతి గదులు ఉన్నాయి. టెర్రస్‌పైన కాన్ఫరెన్స్ హాల్, శిక్షణ కేంద్రంతో పాటు ఉద్యోగుల కోసం భోజనశాలలు ఏర్పాటు చేయనున్నారు.
ఎస్పీ భవనానికి రూ.19 కోట్లు..
జిల్లా ఎస్పీ ప్రధాన భవనానికి రూ.19 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 60 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, క్యాంపు కార్యాలయానికి రూ.3.5 కోట్లు, పరేడ్ గ్రౌండ్‌కు రూ.కోటి, ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు రూ.5.5 కోట్లు, బ్యారక్‌కు రూ.2.6 కోట్లు, రోడ్లు, తాగునీటి వసతి, విద్యుత్‌కు రూ.6.9 కోట్లు కేటాయించారు. మొత్తం అన్ని భవనాలకు కలిపి ప్రభుత్వం రూ.38.5 కోట్లు కేటాయించగా, ఇప్పటి వరకు సుమారు రూ.6 కోట్ల బిల్లులు కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం
జిల్లా ఎస్పీ కార్యాలయ భవనం పనులు 60 శాతం పూర్తయ్యాయి. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాం. త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏఆర్ హెడ్‌క్వార్టర్స్, బ్యారక్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 50 ఎకరాల్లో 38.5 కోట్లతో ఆధునిక హంగులతో ఎస్పీ కార్యాలయ భవనం నిర్మాణం జరుగుతున్నది.
– రోహిణి ప్రియదర్శిని, ఎస్పీ, మెదక్