రామాయంపేట నవంబర్ 14 : మండలంలోని కాట్రియాల గ్రామానికి చెందిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కోరె సాయిలు మరో ముగ్గురు కలిసి హత్య చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి శివారులోని ఎర్రగట్టు అటవీ ప్రాంతంలో సోమవారం జరిగింది. రామాయంపేట ఎస్సై రాజేశ్, భిక్కనూరు ఎస్సై ఆనంద్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోరె జగదీశ్ (28) కొన్నేండ్లుగా తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివాసముంటున్నారు. గ్రామంలో ఐదెకరాల భూమిని అతడి పాలివాడైన కోరె సాయిలుకు కౌలుకు ఇచ్చారు. మూడురోజుల క్రితం జగదీశ్ గ్రామానికి వచ్చాడు. తన భూమిని అమ్ముతున్నాని గ్రామంలో కొంతమందికి తెలిపారు. విషయం తెలుసుకున్న సాయిలు జగదీశ్‌పై కక్ష పెం చుకుని మరో ముగ్గురు వ్యక్తులతో పథకం వేశాడు.
ఆదివారం జగదీశ్‌తోపాటు సాయిలు మద్యం తీసుకుని కామారెడ్డి జిల్లా ర్యాగట్లపల్లి ఎర్రగట్టు ప్రాంతానికి వెళ్లి తాగారు. సాయిలు కర్రలు, బండరాళ్లతో జగదీశ్ ముఖంపై దాడిచేశాడు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ముఖంపై పెట్రోల్‌పోసి తగులబెట్టి అటవీ ప్రాంతంలో ఓ గుంతలో పడేశారు. జగదీశ్ కనిపించకపోవడంతో కుటుంబీకులు సాయిలును నిలదీశారు. జగదీశ్‌ను చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో గ్రామస్తులు నిందితుడు సాయిలును పంచాయతీ కార్యాలయంలో బంధించారు. విష యం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై రాజేశ్ కాట్రియాల గ్రామానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.
కాట్రియాల గ్రామంలో ఉద్రిక్తత
రామాయంపేట ఎస్సై రాజేశ్ తన సిబ్బందితో కాట్రియాల గ్రామంలో బందోబస్తు నిర్వహించారు. నిందితుడి ఇంటి వద్ద పోలీసులుఎలాంటి ఘర్షణలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. మృతదేహం వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ మృతదేహం కదిలేదిలేంటూ బిక్కనూరు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను సముదాయించి న్యాయం చేస్తామని సముదాయించారు. ఈ మేరకు కుటుంబీకుల ఫిర్యాదు మేరు నిందితుడు సాయిలుతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కురుమ పోచయ్య, గంగారాం, మద్ది శ్యాములును పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.