కొల్చారం, నవంబర్ 13 : ఆరోగ్యమే మహాభాగ్యం… తాజా కూరగాయల్లో విటమిన్లు, పోషకాలుంటాయి. వరి, చెరుకు, మొక్కజొన్న, వేరుశనగ కంటె కూరగాయల సాగు లాభదాయకం. కూరగాయల సాగుకు తక్కువ నీరు అవసరం. కొల్చారం మండలంలోని వసురాంతండా వాసులు వానకాలం, శీతాకాలం, వేసవికాలం.. ఏ కాలమైన కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇస్తారు. తాజా కూరగాయలు పండిస్తూ ప్రతిరోజూ ఆదాయం పొందుతూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వసురాంతండాలో 80 కుటుంబా లు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అర ఎకరం నుంచి ఎకరం పొలంలో కూరగాయల తోటను సాగు చేస్తున్నారు. వాన కాలంలో గోరుచిక్కుడు, పుంటి(గోంగూర), బెండ, దోస, పెద్ద చిక్కుడు తదితర కూరగాయలను సాగు చేస్తున్నారు. శీతకాలంలో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పాలకూర, బచ్చలికూర, కొత్తిమీర, మెంతికూరతోపాటు టమాట, వంకాయ పంట లను సాగుచేస్తారు. పండించిన కూరగాయలను కొల్చారం, పోతంశెట్పల్లి, చిన్నాఘన్పూర్, కౌడిపల్లి గ్రామాల్లో జరిగే వారాంతపు సంతలో అమ్ముతారు. వ్యవసాయానికి తోడు కూరగాయను పండించడంతో అదనపు ఆదాయం వస్తున్న ది. దీంతో పిల్లల చదువులు, వ్యవసాయ కూలీల ఖర్చులకు సరిపోతాయని గిరిజనులు పేర్కొంటున్నారు. అటవీభూముల్లో బోర్లు వేస్తే తగినంత నీళ్లు రాకపోవడంతో మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలను సాగు చేస్తుంటారు. యాసంగిలో ప్రతి కుటుంబం కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ఆదాయం పొందుతున్నారు.
కూరగాయలనే సాగు చేస్తున్నాం..
తండాలో కూరగాయలనే సాగు చేస్తున్నాం. ప్రతి ఇం టికి అర ఎకరం నుంచి ఎకరం పొలంలో కూరగాయల పంటలను సాగు చేస్తాం. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి సబ్సిడీ విత్తనాలు వస్తున్నాయి. స్ప్రే పంపులు ఇవ్వడంతో తోటలకు రోగాలు రాకుండా మందులు కొడుతున్నాం. సేంద్రియ ఎరువులతో కూరగాయలను సాగు చేస్తున్నాం.
– గణేశ్, వసురాంతండావాసి
చుట్టుపక్కల అంగళ్లలో అమ్ముతాం..
పండిన ఆకుకూరలు, కూరగాయలను చుట్టుపక్కల గ్రామాల్లో రోజూ ఉదయం అమ్ముకుంటాం. కొల్చారం, పోతంశెట్పల్లి, చిన్నాఘన్పూర్, కౌడిపల్లిలో జరిగే వారాంతపు సంతకు కూరగాయలు తీసుకుపోతాం. తండా నుంచి కూరగాయలు వస్తే ప్రతి ఒక్కరూ మా దగ్గరనే కూరగాయలు, ఆకు కూరలు తీసుకుంటారు. తక్కువ ధరకే ఇస్తాం.
– కపూరి, వసురాంతండావాసి