రామచంద్రాపురం, నవంబర్ 13: వేద పండితుల మంత్రాలతో సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్ కాలనీ మార్మోగింది. సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆర్సీపురం మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో చండీయాగం మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది. మండల బ్రాహ్మణులందరూ ఏకమై అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని శతచండీ మహాయాగానికి శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా వందమంది వేది పండితులు వచ్చి యాగాన్ని నిర్వహించారు. చండీమాత పూజతో పాటు మొదటిరోజు గణపతి, రెండోరోజు శివపార్వతులు, మూడోరోజు చండీమాత పూజలు నిర్వహించారు. చండీయాగాన్ని తిలకించేందుకు పటాన్చెరు, శేరిలింగంపల్లి నియోజక వర్గాల్లోని వివిధ ప్రాంతాల భక్తజనం అధిక సంఖ్యలో వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అమ్మవారి దర్శనం చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ప్రతిరోజు మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యాగానికి వచ్చిన భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్దఎత్తున మహా చండీయాగం నిర్వహించడం, చండీ యాగాన్ని చూసే భాగ్యం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు అంటున్నారు.
మూడోరోజు నిర్వహించిన పూజలు..
శతచండీ యాగంలో భాగంగా ఆదివారం శాంతి పఠనం, స్థాపిత దేవతా పూజ, మహాసౌర సహిత ద్వాదశ అరుణ పారాయణ, సూర్య సమస్కారాలు, అరుణ హోమం, ఆవాహిత దేవతా హవనం, శతచండీ హవనం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, అవబృధం, మహాదాశీర్వచనం, రుత్విక్ సన్మానం పూజలు నిర్వహించారు.
వైభవంగా మహా పూర్ణాహుతి..
రుద్ర సహిత శతచండీ మహాయాగంలో భాగంగా ఆదివారం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రముఖ పండితులు, శృంగేరీ ఆస్థాన విధ్వాంసులు వి.గోపికృష్ణశర్మ, మాడుగుల పురుషోత్తమ శర్మ నేతృత్వంలో చతుర్వేద పండితులు, వేద విధ్వాంసులు పూర్ణాహుతిని వైభవంగా జరిపారు. వంద కిలోల పాయసం, పట్టు వస్ర్తాలు, అష్టోత్తరశత సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పుష్పాలతో పాటు అందరికీ కూడా పూర్ణాహుతితో సంపూర్ణమైనటువంటి ఫలాన్ని, యగ్న ముఖం ద్వారా అమ్మవారికి ఆవు నెయ్యితో వసోర్దారా పూర్వకంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితులు, విధ్వాంసులతో పూర్ణాహుతి కార్యక్రమం సుసంపన్నమైనది. ఆధ్యాత్మిక ప్రవచన కర్త, శృంగేరీ ఆస్థాన పౌరాణికులు బంగారయ్య శర్మ ధార్మిక ప్రవచనాలు చేశారు. అమ్మవారి అనుగ్రహ వివరణ ఇచ్చారు.
ఐదువేల మంది భక్తులకు అన్నదానం
చండీ యాగానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం చండీ యాగం చివరిరోజు కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చారు. సుమారుగా ఐదువేల మంది భక్తులకు అన్నదానం చేశారు. యాగానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
యాగం చేయడం గొప్పవిషయం
లోకం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని బ్రాహ్మణులు అందరూ కలిసి శతచండీ మహాయాగం చేయడం గొప్పవిషయమని ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి అన్నారు. ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, నగేశ్, యాదగిరి యాదవ్ చండీయాగానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణార్థం శతచండీ యాగాన్ని నిర్వహించడం శుభసూచికమని తెలిపారు. యాగాన్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండేందుకు బ్రాహ్మణులు యాగం నిర్వహిస్తున్నందుకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.