మెదక్ అర్బన్, నవంబర్12: చిన్న చిన్న గొడవలతో కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం మెదక్ జిల్లా న్యాయస్థానాల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద మాట్లాడుతూ రాజీ చేసుకోవడంతో ఇరువురికి న్యాయం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమమన్నారు. జిల్లా వ్యాప్తంగా 10,224 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్, జిల్లా అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కల్పన, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.బాలయ్య, న్యాయవాదులు చంద్రారెడ్డి, వినోద్‌కుమార్, రామ్శర్మ, కరుణాకర్, శ్రీనివాస్‌గౌడ్, సిద్దిరాములు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి, నవంబర్12: కోర్టుల్లో కేసులు వేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి సూచించారు. జిల్లా కోర్టులో లోక్ అదాలత్‌ను ఆయన ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హన్మంతరావు నిర్వహించారు. భూ నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేశారు. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట్, నారాయణఖేడ్ కోర్టుల్లో 11 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటుచేశారు. ఈ లోక్ అదాలత్‌లలో 772 కేసులు పరిష్కరించి, రూ.16,91,90,530 పరిహారా న్ని బాధితులకు అందించామన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు న్యాయమూర్తి సుదర్శన్, మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి సి.రాజు, సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణా చౌహాన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి ఎస్.శాలిని, ఏక్సైజ్ కోర్టు జడ్జి కుమారి తేజస్వీ పాల్గొన్నారు.